నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ఎందుకంటే?
ఆలయ అధికారుల తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్‌పై నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.
ఆలయ అధికారుల తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్‌పై నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో ప్రతి సంక్రాంతి పండుగకు వీరభద్రస్వామి జాతర జరుగుతుంది. ఈ జాతరకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. జాతర నిర్వహణకు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేశారు. అధికారులు, పోలీసులు, పాలక వర్గానికి జాతర నిర్వహణపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అయితే జాతర నిర్వహణలో పోలీసులు, అధికారులు, పాలక కమిటీ మధ్య ఏకాభిప్రాయం లోపించింది. జాతర విధుల నిర్వహణ కోసం వచ్చిన కొందరు పోలీసు అధికారుల ప్రవర్తనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అదే సమయంలో దేవాదాయ శాఖ అధికారులపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. వీటన్నింటిని గ్రహించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. పోలీసులు, అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీసం గర్భగుడిలోకి వెళ్లకుండా బయట నుంచే మొక్కులు చెల్లించుకుని వెళ్లిపోయారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నేలపై కూర్చొని తన అసహనాన్ని ప్రదర్శించడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పోలీసులు ఎంత బ్రతిమలాడినా ఆయన అక్కడి నుంచి లేవకుండా అక్కడే కూర్చుని ప్రెస్ మీట్ నిర్వహించారు.