మాకొద్దు.. మావాళ్లకివ్వండి.. ఖమ్మం కాంగ్రెస్ టికెట్‌పై సీనియర్ల కొత్త ప్లాన్
ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే, రవాణా మంత్రి పువ్వాడ అజయ్ పోటీ చేయడం ఖాయమైపోయింది. తొలుత ఈ సీటు నుంచి పోటీ చేయాలని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భావించారు.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా పాలేరు టికెట్ కోసం కీలక నేతలు వేస్తున్న ఎత్తులు ఇప్పుడు ఖమ్మం టికెట్‌నూ ప్రభావితం చేస్తున్నాయి. బీఆర్ఎస్‌ను వదిలి కాంగ్రెస్‌లో చేరి ప్రచార కమిటీ కోఛైర్మన్‌గా కీలక బాధ్యతలు చేపట్టిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఈ సీటుపై గురిపెట్టారు. అయితే తమకోసం కాదు.. తమను నమ్ముకుని ఉన్న అనుచరుల కోసం.
మనసు మార్చుకున్న పొంగులేటి
ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే, రవాణా మంత్రి పువ్వాడ అజయ్ పోటీ చేయడం ఖాయమైపోయింది. తొలుత ఈ సీటు నుంచి పోటీ చేయాలని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భావించారు. అయితే పాలేరు అయితే సేఫ్ అనే భావనతో ఆయన వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. అజయ్‌కి పోటీగా అదే సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు అయితే విజయం సాధించచవ్చని కాంగ్రెస్ భావించింది. అయితే తుమ్మల కూడా పాలేరులోనే పోటీ చేస్తానని పట్టబడుతున్నారు.
మావాళ్లకు ఇవ్వండని రాయబారాలు
ఇదిలా ఉంటే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, ఖమ్మం జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయ్‌బాబు ఖమ్మం, పాలేరుల్లో ఏదైనా టికెట్ ఇవ్వాలని అప్లయ్ చేశారు. అజయ్ సామాజిక వర్గానికి చెందిన విజయ్‌బాబు అయితే బాగుంటుందని పొంగులేటి రాయబారం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జావెద్‌ను తెరపైకి తెస్తున్నారు.
ఇకపోతే సీనియర్ నేత రేణుకా చౌదరి కూడా తనవారికి టికెట్ కోసం పట్టుబడుతున్నారట. తన వర్గీయుడైన ఖమ్మం మాజీ ఏఎంసీ ఛైర్మన్ మానుకొండ రాధాకిషోర్ పేరును ఆమె ప్రతిపాదిస్తున్నారు. వీరంతా టికెట్ కావాలని గాంధీభవన్‌లో అప్లికేషన్లు కూడా పెట్టారు.