NDA - నేషనల్ డిజాస్ట్రస్ అలయన్స్.. ఎగ్జామ్స్ రద్దుపై కేటీఆర్ ట్వీట్
ఎలాంటి ఆధారాలు లేకుండా NEET - PG పరీక్షను కొన్ని గంటలు ముందు వాయిదా వేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారిందంటూ మండిపడ్డారు.
జాతీయ స్థాయిలో వరుసగా ప్రవేశ పరీక్షలు రద్దు కావడంపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విద్యార్థుల జీవితాలు చిన్నాభిన్నం చేసేలా వరుసగా జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. నీట్ - అండర్ గ్రాడ్యుయేట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందని ఆధారాలున్నప్పటికీ.. జూన్ 6న కౌన్సిలింగ్ నిర్వహించాలని మోడీ సర్కార్ నిర్ణయించడాన్ని తప్పుపట్టారు కేటీఆర్. ఇక ఎలాంటి ఆధారాలు లేకుండా NEET - PG పరీక్షను కొన్ని గంటలు ముందు వాయిదా వేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారిందంటూ మండిపడ్డారు.
కేటీఆర్ ట్వీట్ ఇదే -
విద్యార్థుల జీవితాలను ఆగం చేసేలా వరుసగా జరుగుతున్న ఘటనలు దురదృష్టకరం.
జూన్ 4 - నీట్ - యూజీ పేపర్ లీక్
జూన్ 19 - యూజీసీ - నెట్ - రద్దు
జూన్ 21 - CSIR - UGC - NET - వాయిదా
జూన్ 22 - NEET - PGT చివరి నిమిషంలో వాయిదా
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలకు ఎలాంటి లాజిక్ లేదు. NEET - UG ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అయిందని ఆధారాలు ఉన్నప్పటికీ.. మోడీ ప్రభుత్వం జూన్ 6న కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇక విద్యార్థులను తీవ్ర నిరాశకు గురి చేస్తూ.. నీట్ - PG పరీక్షను కొన్ని గంటల ముందు ఎలాంటి కారణాలు చూపకుండా వాయిదా వేశారు. ఇదేం లాజిక్. కేంద్ర ప్రభుత్వ అసమర్ధత విద్యార్థుల పాలిట శాపంగా మారింది. నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ - NDA కాస్త నేషనల్ డిజాస్ట్రస్ అలయన్స్‌గా మారిందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
జాతీయ స్థాయిలో పలు ప్రవేశ పరీక్షలు వరుసగా రద్దు కావడం ఇటీవల సంచలనంగా మారింది. నీట్ - అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షపై ఓ వైపు వివాదం కొనసాగుతుండగానే.. పేపర్ లీక్ అయ్యిందంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ - నెట్ పరీక్షన్ రద్దు చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దాదాపు ఈ పరీక్షకు 9 లక్షల మంది హాజరయ్యారు. తర్వాత CSIR - UGC - NET, NEET - PGT పరీక్షలు వరుసగా రద్దు కావడం చర్చనీయాంశం అయింది. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది హాజరైన నీట్ ఎగ్జామ్‌పైనా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నీట్‌లో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.