ముంబై డ్రగ్స్ మాఫియా నిందితుల పట్టివేత.. - డెకాయ్ ఆపరేషన్‌తో ఛేదించిన హైదరాబాద్ పోలీసులు
అరెస్టు చేసిన నలుగురు నిందితుల నుంచి 204 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.
ముంబై డ్రగ్స్ మాఫియా సమాచారం అందడంతో డెకాయ్ ఆపరేషన్ చేపట్టిన హైదరాబాద్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అరెస్టు చేసిన నలుగురు నిందితుల నుంచి 204 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.
అరెస్టు చేసిన నిందితుల వివరాలను నగర సీపీ సీవీ ఆనంద్ మంగళవారం వెల్లడించారు. నిందితులు ముంబైకి చెందిన జతిన్ బాలచంద్ర భలేరావు (36), జావెద్ షంషేర్ అలీ సిద్దిఖీ (34), జునైద్ షేక్ షంషుద్దీన్ (28) వికాస్ మోహన్‌కుమార్ అలియాస్ విక్కీ (28)లుగా తెలిపారు. బంజారా హిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో హెచ్‌న్యూ డీసీపీ గుమ్మి చక్రవర్తితో కలసి ఈ వివరాలు తెలియజేశారు.
నిందితుడు జతిన్ తనను తాను బీమా ఏజెంట్‌గా చెప్పుకుంటాడు. ముంబై సింథటిక్ డ్రగ్ డీలర్ల నుంచి నిషేధిత ఎండీఎంఏను కిలో రూ.10 లక్షలకు కొనుగోలు చేసేవాడు. దాన్ని 5, 10 గ్రాములుగా విభజించి బయటి మార్కెట్‌లో రూ.20 లక్షలకు విక్రయించేవాడు. మరో మిత్రుడు జునైద్‌తో కలిసి పార్టీలు నిర్వహిస్తూ.. ఆడపిల్లలకు ఎండీఎంఏ అలవాటు చేసేవారు. వారు మత్తులో ఉండగా వారిపై లైంగిక దాడికి పాల్పడేవారు. జతిన్ కస్టమర్లలో 81 మంది, జావెద్ కస్టమర్లలో 30 మంది యువతులేనని పోలీసులు ఈ సందర్భంగా గుర్తించారు. అదే ప్రాంతానికి చెందిన వికాస్, దినేశ్ సోదరులు, మరో నిందితుడు జునైద్ షేక్ షంషుద్దీన్ వీరివద్ద పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను కొనుగోలు చేసి.. కస్టమర్లకు చేరవేసేవారు.
ఐటీ ఉద్యోగిని హైదరాబాద్ రాకతో వ్యవహారం వెలుగులోకి..
ముంబైకి చెందిన మహిళ సనాఖాన్ (34)కి హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆమె నగరానికి వచ్చింది. అప్పటికే డ్రగ్స్ అలవాటు ఉన్న ఆమె వాటి కోసం వారాంతంలో ముంబై వెళ్లి తెచ్చుకునేది. అలాగే అక్కడ గ్రాము రూ.100 చొప్పున 10 నుంచి 20 గ్రాముల వరకు కొనుగోలు చేసి.. ఇక్కడి యువతులకు గ్రాము రూ.2000 చొప్పున విక్రయించేది. ఆమె వద్ద నగరానికి చెందిన 20 మంది యువతులు డ్రగ్స్ కొనుగోలు చేసేవారని సమాచారం.
ఇదేవిధంగా గత నెల 9న ముంబై నుంచి రైలులో వస్తుండగా సికింద్రాబాద్ స్టేషన్‌లో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆమె నుంచి సేకరించిన సమాచారంతో నగర నార్కోటిక్స్ పోలీసులు వలపన్ని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.