మునుగోడు ఉపఎన్నిక.. ఎల్బీనగర్‌లో ప్రచారం
మునుగోడుకు చెందిన దాదాపు 20 వేల నుంచి 25 వేల మంది ఓటర్లు ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లోని పలు కాలనీలు, బస్తీల్లో ఉన్నట్లు రాజకీయ పార్టీలు గుర్తించాయి.
ఎక్కడ ఎన్నిక జరిగితే అక్కడ ప్రచారం చేయడం పరిపాటి. మరి మునుగోడులో ఉపఎన్నిక అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్‌లో ఎందుకు ప్రచారం చేస్తున్నారనే అనుమానం రావడం సహజం. భువనగిరి లోక్‌సభ పరిధిలోని మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. బైపోల్ షెడ్యూల్ వచ్చే వరకు సైలెంట్‌గా ఉన్న పార్టీలు ఇప్పుడు ప్రచారంలో దూసుకొని పోతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే.. తమ పార్టీకి ఓటేసేలా ఓటర్లను బతిమిలాడుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో ఒక్క ఓటైనా చాలా విలువైనదిగానే అన్ని పార్టీలు భావిస్తున్నాయి. సాధారణంగా అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఏ నియోజకవర్గ అభ్యర్థి అదే నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటారు. తన నియోజకవర్గానికి చెందిన ఓటర్లు వేరే చోట్ల ఉన్నా.. వారి బంధువులతోనో, ఇతర సన్నిహితులతోనో చెప్పిస్తారు.
మునుగోడు ఉపఎన్నిక ప్రతిష్టాత్మకం కావడంతో ప్రతీ ఒక్క ఓటర్‌ను కలవాలని పార్టీలు డిసైడ్ అయ్యాయి. మునుగోడులో ఓటు హక్కు కలిగి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి కోసం అన్వేషిస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్ మండలాలతో పాటు కొత్తగా ఏర్పడిన గట్టుప్పల మండలం హైదరాబాద్‌కు దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే ఎల్బీనగర్ నియోజకవర్గం ఆ మండలాల ప్రజలకు చాలా దగ్గర. ఆయా మండలాలకు చెందిన చాలా మంది ఉపాధి, విద్య కోసం నగరానికి వలస వచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూ చాలా మంది ఇక్కడే నివసిస్తున్నారు. కొంత మంది సొంత ఇళ్లు కట్టుకొని ఉండగా.. మరికొంత మంది అద్దెలకు ఉంటున్నారు. కానీ, వాళ్ల ఓటు హక్కు మాత్రం సొంత గ్రామాల్లోనే కొనసాగిస్తున్నారు. ఇలా మునుగోడుకు చెందిన దాదాపు 20 వేల నుంచి 25 వేల మంది ఓటర్లు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు కాలనీలు, బస్తీల్లో ఉన్నట్లు రాజకీయ పార్టీలు గుర్తించాయి.
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 97 శాతం పోలింగ్ జరిగింది. సొంత ఊరికి దగ్గరలోనే ఉండటంతో ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లోని చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి అక్కడకు వెళ్లారు. ఇప్పుడు ఉపఎన్నిక ప్రతీ పార్టీకి కీలకం కావడంతో భారీ సంఖ్యలో ఓటర్లు ఉన్న ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. అయితే మునుగోడులో చేసినట్లు బహిరంగ ప్రచారం కాకుండా.. ఓటర్ల లిస్టును దగ్గర పెట్టుకొని.. ఎల్బీనగర్ ప్రాంతంలో మునుగోడు ఓటర్లు ఎక్కడ ఉంటున్నారో కనుక్కొని గడపగడపకు పార్టీ కార్యకర్తలు వెళ్తున్నారు. వారికి అవసరమైన తాయిలాల ఆశ చూపడమే కాకుండా పోలింగ్ రోజు రవాణా కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం మునుగోడు ఓటర్‌కు మంచి డిమాండ్ ఉంది. దీంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు కూడా ఫోన్లు చేసి రమ్మంటున్నారు. అవసరం అయితే రవాణా ఖర్చులు ముందుగానే జీపే లేదా ఫోన్‌పే చేస్తామని చెబుతున్నారు.
మొత్తానికి మునుగోడు ఓటర్లు ఎక్కడ ఉన్నా.. ప్రస్తుతానికి కొన్ని రోజులు కింగుల్లా బతికేస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీల కార్యకర్తలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మరీ ఓట్లు వేస్తే ఈ సారి కూడా పోలింగ్ 95 శాతం మించిపోవడం ఖాయమని అధికారులు అంటున్నారు. అధికారులు ఏ మాత్రం కష్టపడకుండానే స్వయంగా రాజకీయ పార్టీలే పోలింగ్ శాతాన్ని పెంచే పడిలో నిమగ్నమయ్యాయి.