మోదీజీ.. మీరు తెలంగాణకు రావొద్దు

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చే ముందు 2వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా కల్పించాలన్నారు.

Advertisement
Update:2023-07-06 07:42 IST

తెంలగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ ముందు వరంగల్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అసలు మోదీ తెలంగాణకు రావాల్సిన అవసరం లేదని అంటున్నారు మరో మంత్రి ప్రశాంత్ రెడ్డి. ప్రధాన మంత్రిగా అన్ని రాష్ట్రాలను సమానంగా చూసే బాధ్యత మోదీపై ఉందని గుర్తు చేశారు ప్రశాంత్ రెడ్డి. అన్ని రాష్ట్రాలకు ప్రధాని, తండ్రిలా ఉండాలని.. కానీ ఆయన యూపీ, గుజరాత్ కి ఎక్కువ నిధులిస్తుంటారని, తెలంగాణ వంటి రాష్ట్రాలకు మొండిచేయి చూపిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి సరైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

అలా అయితే రావొద్దు..

సీఎం కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడానికి, ఎమ్మెల్సీ కవితను జెలుకి పంపిస్తామని చెప్పడానికయితే మోదీ తెలంగాణ రావాల్సిన అవసరం లేదన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఇటీవల భోపాల్ సభలో ప్రధాని మోదీ, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వరంగల్ సభలో కూడా ఆయన ప్రసంగంలో అభివృద్ధి కంటే ఆరోపణలే ఎక్కువగా వినిపిస్తాయనే ఊహాగానాలున్నాయి. అలాంటి విమర్శలకోసం ప్రధాని వరంగల్ రావాల్సిన అవసరం లేదంటున్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.

2వేల కోట్ల ప్యాకేజ్ ప్రకటించండి..

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చే ముందు 2వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. గుజరాత్, ఉత్తర ప్రదేశ్, కర్నాటకలో మెట్రో అభివృద్ది పనులకు డబ్బులు ఇచ్చినట్టే, తెలంగాణ మెట్రో పనులకు కూడా కేంద్రం నిధులివ్వాలని అన్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా కల్పించాలన్నారు.

Tags:    
Advertisement

Similar News