కాంగ్రెస్ నేమ్ ఛేంజర్ మాత్రమే.. గేమ్ ఛేంజర్ కాదు

మధ్యంతర బడ్జెట్‌లో ప్రజలు చాలా ఆశించారని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్ దారి చూపిస్తుందని భావించారని.. కానీ ఏదీ జరగలేదన్నారు ఎమ్మెల్సీ కవిత.

Advertisement
Update:2024-02-10 17:57 IST

పేర్లు, చిహ్నాలు మార్చడానికి ఇచ్చిన ప్రాధాన్యత హామీల అమలుకు, బడ్జెట్ కేటాయింపులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెడుతున్నారు కానీ, ప్రగతి గేర్లను మార్చడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ తొలి బడ్జెట్ పై స్పందించిన ఆమె.. మధ్యంతర బడ్జెట్ ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చిందన్నారు. ఆరు గ్యారెంటీల హామీలలో కొన్నిటికి కనీసం నిధులు కేటాయించలేదని, వాటి గురించి బడ్జెట్ లో ప్రస్తావనే లేదన్నారు కవిత.


కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరిట తమ ప్రభుత్వం పేదలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేసేదని, దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు బడ్జెట్ లో ఆ ప్రస్తావనే చేయలేదని అన్నారు కవిత. ఆశావర్కర్ల జీతాల పెంపు, ఇమామ్ లు, మౌజమ్ ల గౌరవ వేతనం.. తదితర అంశాలలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని బడ్జెట్ బట్టబయలు చేసిందని విమర్శించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కేటాయింపులు చేయకుండా కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే బడ్జెట్ సమావేశాలు పరిమితమవుతున్నాయని అన్నారు కవిత.

మధ్యంతర బడ్జెట్‌లో ప్రజలు చాలా ఆశించారని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్ దారి చూపిస్తుందని భావించారని.. కానీ ఏదీ జరగలేదన్నారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ హయాంలో రెండు నెలలకే పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారామె. కేసీఆర్ హయాంలో ఒక్క నిమిషం కూడా విద్యుత్‌ కోత ఉండేది కాదని, ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలోనే ప్రతి రోజూ 3-4 గంటల పాటు కరెంటు పోతోందన్నారు. ఆరు గ్యారెంటీల అమలు ఎలా ఉంటుందనేది బడ్జెట్ కేటాయింపుల్లోనే తేలిపోయిందని, కాంగ్రెస్ మోసపు హామీల గురించి ప్రజలు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చారని చెప్పారు కవిత. 

Tags:    
Advertisement

Similar News