ఓబీసీ మహిళా రిజర్వేషన్ కోసం పోరాడతా - ఎమ్మెల్సీ కవిత

అంబేద్కర్ కేవలం దళితులకోసమే కాకుండా మహిళల హక్కుల కోసం కూడా కృషి చేశారని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. అంబేద్కర్‌ స్ఫూర్తితోనే తాను మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమించానని తెలిపారు.

Advertisement
Update:2023-10-07 08:16 IST

మహిళా రిజర్వేషన్‌ బిల్లు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఓబీసీ మహిళా రిజర్వేషన్ల కోసం తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. లండన్‌ పర్యటనలో ఉన్న ఆమె అంబేద్కర్‌ మ్యూజియాన్ని సందర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఆశయాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్కరే నెరవేరుస్తున్నారని చెప్పారు. అంబేద్కర్‌ స్ఫూర్తితో తెలంగాణలో అనేక పథకాలు అమలవుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌ లో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, సచివాలయానికి కూడా ఆ మహనీయుడు పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ సాధ్యమైందని, తనకు అంబేద్కర్ ఆదర్శమని తెలిపారు.

అది ఎన్నికల స్టంట్..

వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు తెరపైకి తెచ్చిందన్నారు కవిత. జనగణన, నియోజక వర్గాల పునర్విభజనతో మహిళా రిజర్వేషన్ల అమలును ముడిపెట్టడమే దీనికి నిదర్శనమన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలు.. తేదీ లేని పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులా ఉందన్నారు.

పోరాటం కొనసాగుతుంది..

అంబేద్కర్ కేవలం దళితులకోసమే కాకుండా మహిళల హక్కుల కోసం కూడా కృషి చేశారని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. అంబేద్కర్‌ స్ఫూర్తితోనే తాను మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమించానని తెలిపారు. సమ్మిళిత దేశ నిర్మాణం కోసం అంబేద్కర్‌ స్ఫూర్తిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ల అమలుకోసం ఓబీసీ మహిళల రిజర్వేషన్ల కోసం తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు ఎమ్మెల్సీ కవిత. 

Tags:    
Advertisement

Similar News