మహిళ రిజర్వేషన్ల బిల్లు కోసం ఉద్యమాన్ని ఉదృతం చేయనున్న ఎమ్మెల్సీ కవిత
మహిళ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించిన ఉద్యమాన్ని దేశమంతటా విస్తరించాలని కవిత నిర్ణయించారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయనున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో మహిళ రిజర్వేషన్ల బిల్లు ఉద్యమానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. 'మహిళ సాధికారతే దేశ సాధికారత'.. నేను మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు పలుకుతున్నానని ముద్రించి ఉన్న ప్లకార్డును చేతిలో పట్టుకున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
మహిళ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించిన ఉద్యమాన్ని దేశమంతటా విస్తరించాలని కవిత నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ఒక కార్యచరణ తయారు చేశారు. దేశంలో పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా యూనివర్సిటీలు, కాలేజీల్లో విద్యార్థులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి.. అక్కడ బిల్లుపై చర్చించనున్నారు. అలాగే చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరంపై దేశంలోని విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, మేధావులకు పోస్టు కార్డులు రాయాలనీ కవిత భావిస్తున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేశారు. అంతే కాకుండా దాదాపు 18 రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మహిళ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించేలా ఒత్తిడి తీసుకొని వచ్చారు. అయితే వీళ్ల డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. దీంతో మహిళ రిజర్వేషన్ల బిల్లు ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయాలని నిర్ణయించారు.