కాంగ్రెస్ లేకుండా చేసే కుట్ర.. - ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
టీఆర్ఎస్, బీజేపీ తిట్టుకోవడం వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమిటి?. పొలిటికల్ పార్టీలు.. ప్రజల కోసం కొట్లాడాలి.. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కొందరు రాజకీయ నేతలు వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటున్నారు.
రాజకీయాలపై ఎప్పుడూ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసేందుకు కుట్ర జరుగుతోందని వాపోయారు. నిత్యం టీఆర్ఎస్, బీజేపీ మాత్రం లైమ్ లైట్ లో కనిపించేలా వ్యూహాలు రచిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పెద్దలు కూడా పార్టీ భవిష్యత్ కోసం ఆలోచించకుండా జూమ్ మీటింగ్‌లు, అంతర్గత పంచాయితీలు తెంపుకోవడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని సొంత పార్టీపై విమర్శలు చేశారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే.. 'టీఆర్ఎస్, బీజేపీ తిట్టుకోవడం వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమిటి?. పొలిటికల్ పార్టీలు.. ప్రజల కోసం కొట్లాడాలి.. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కొందరు రాజకీయ నేతలు వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్‌ను సైడ్ చేస్తున్నారు. టీవీ చూసే ప్రేక్షకులకు టీఆర్ఎస్, బీజేపీ వినోదాన్ని పంచుతున్నాయి' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీజేపీ ఎంపీ అరవింద్ మధ్య మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అరవింద్ వ్యాఖ్యలకు నిరసనగా కవిత అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి మాట్లాడారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికల్లో ఆ పార్టీ డిపాజిట్ కోల్పోయింది.
ఓ వైపు రాహుల్ గాంధీ జోడో యాత్ర సాగుతోంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం పెద్దగా ఏ కార్యక్రమాలు చేయడం లేదు. రేవంత్ రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడైన కొత్తలో కొంత హడావుడి కనిపించింది. ఓ వర్గం మీడియా ఆయనకు హైప్ ఇచ్చేది. కానీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులను బుజ్జగించడం, కీలక నేతలు పార్టీ నుంచి జారిపోకుండా చూసేందుకే పీసీసీ చీఫ్ కు సమయం సరిపోవడం లేదు. దీంతో ఆ పార్టీ ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు చేయడం లేదు. ఒకటి అరా చేసినా ప్రజల్లో పెద్దగా స్పందన ఉండటం లేదు.
ప్రస్తుతం మీడియాలో కూడా బీజేపీ, టీఆర్ఎస్ కు మాత్రమే.. ప్రాధాన్యం దక్కుతోంది. ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి బీజేపీ చేస్తున్న దూకుడు రాజకీయాలను తట్టుకొని.. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని కాంగ్రెస్ చెప్పగలదా? అందుకు తగినట్టుగా రాజకీయ కార్యక్రమాలు చేయగలదా? అన్నది వేచి చూడాలి.