పరీక్షలు పోస్ట్ పోన్ చెయ్యం.. మరోసారి ప్రభుత్వం క్లారిటీ
టీజీపీఎస్సీ స్వయం ప్రతిపత్తిగల సంస్థ అని, ఆ సంస్థ అందర్నీ సంప్రదించే నిర్ణయాలు తీసుకుందని, అందులో మార్పులు ఉండబోవని చెప్పారు మంత్రి పొన్నం.
తెలంగాణలో పోటీ పరీక్షలు వాయిదా వేయాలంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు ఫలితం కనిపించేలా లేదు. పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అదే మాట చెప్పారు. ఉద్యమ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా తాను మరోసారి క్లారిటీ ఇస్తున్నానని, పరీక్షలు పోస్ట్ పోన్ చేసే ప్రసక్తే లేదని చెప్పారు పొన్నం.
పదే పదే పరీక్షలు వాయిదా వేసుకుంటూ పోతే జాబ్ క్యాలెండర్ కి అర్థమే ఉండదని అన్నారు మంత్రి పొన్నం. రాజకీయ పార్టీల ఉచ్చులో పడి అభ్యర్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోవద్దని ఆయన సూచించారు. గత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదని, పోస్ట్ లు భర్తీ చేయలేదని, ఇప్పుడు తాము ఆ పని చేస్తుంటే అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. విద్యార్థుల కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, వాయిదాలు లేకుండా పరీక్షలు జరిగితేనే వారికి ఉపయోగం ఉంటుందని, స్పష్టం చేశారు. అవసరమైతే సలహాలు, సూచనలు ఇవ్వాలని.. ప్రతిపక్షాల ఉచ్చులో పడి మోసపోవద్దని విద్యార్థులకు సూచించారు మంత్రి పొన్నం.
పోటీ పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు లాభం అని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంత్రి పొన్నం మాత్రం కోచింగ్ సెంటర్ల విషయాన్ని ప్రస్తావించలేదు. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రతిపక్షం అడ్డుకోవాలని చూసిందని, ఇప్పుడు ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా అడ్డుపుల్ల వేయాలనుకుంటున్నారని ఆయన విమర్శించారు. టీజీపీఎస్సీ స్వయం ప్రతిపత్తిగల సంస్థ అని, ఆ సంస్థ అందర్నీ సంప్రదించే నిర్ణయాలు తీసుకుందని, అందులో మార్పులు ఉండబోవని చెప్పారు మంత్రి పొన్నం.