కాంగ్రెసోళ్లకు కడుపుమంట ఎందుకు..?

Advertisement
Update:2023-11-27 18:44 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడిన వేళ.. రాజకీయం అంతా ఇప్పుడు రైతుబంధు చుట్టూనే తిరుగుతోంది. రైతుబంధుకి కాంగ్రెస్ మోకాలడ్డటం, బీఆర్ఎస్ ఈసీకి లేఖ రాసి అనుమతి తెచ్చుకోవడం, మళ్లీ కాంగ్రెస్ అడ్డుపుల్ల వేయడం, ఫైనల్ గా ఎన్నికల కమిషన్ రైతుబంధు ఇవ్వొద్దని ఆదేశాలివ్వడం.. ఈ ఎపిసోడ్ అంతా రాజకీయ రచ్చకు కారణం అయింది. ఫైనల్ గా ఈ ఎపిసోడ్ లో కాంగ్రెస్, తెలంగాణ అన్నదాతల పాలిట విలన్ గా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ వ్యవహార శైలిపై ట్వీట్ వేశారు. పంట పెట్టుబడి ఇస్తే కాంగ్రెసోళ్లకు కడుపుమంట ఎందుకంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


ఎరువులకు విత్తనాలకు పైసలిచ్చే రైతబంధును బంద్ పెట్టిస్తున్నారెందుకు..?

ఎవుసం చేసే రైతులపై పగ ఎందుకు..?

అన్నదాతకు సాయం అందకుండా అడ్డుపుల్లలు వేసి వికృతానందం పొందుతున్నారెందుకు...?

దుక్కిదున్నే బక్క రైతులపై ద్వేషం ఎందుకు...? అన్నంపెట్టే రైతుల మీద అక్కసు ఎందుకు..?

అంటూ కేటీఆర్ తన ట్వీట్ లో ప్రశ్నల వర్షం కురిపించారు.

రైతులకు 24గంటలు కరెంటు ఇస్తున్నా కూడా కాంగ్రెస్ ఓర్వలేకుండా ఉందని మండిపడ్డారు కేటీఆర్. తాము అధికారంలోకి వస్తే 3 గంటలే కరెంటు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. అదేమంటే 10 హెచ్.పి. మోటర్లు పెట్టుకోవాలని మూర్ఖంగా ప్రకటిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ధరణి విషయంలో కూడా కాంగ్రెస్ రాజకీయాన్ని ఆయన తప్పుబట్టారు. రైతు చేనుకు రక్షణ కంచెగా వుండే ధరణి మీద కాంగ్రెస్ నేతలకు కక్ష ఎందుకన్నారు. దళారుల రాజ్యం తెచ్చి భూమేతకు అనుమతి ఇస్తామని నిస్సిగ్గుగా చెబుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇస్తామంటున్న రైతు భరోసా విషయంలో అసలు రైతు, కౌలు రైతు అనే భేదం పాటిస్తున్నారని మండిపడ్డారు. పండుగలా మారిన వ్యవసాయాన్ని మళ్లీ దండుగ చేసే దరిద్రపు రోజులు కావాలా ..? ఆలోచించండి..! అంటూ తన ట్వీట్ ద్వారా ప్రజలను ప్రశ్నించారు కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News