కాంగ్రెస్‌లో అందరూ సీఎంలే - కేటీఆర్ సెటైర్
కర్ణాటక రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని మొత్తుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ పాలన చూసి ఓటేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు.
కాంగ్రెస్ పార్టీలో అందరూ సీఎంలేనంటూ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న దశలో ఒకపక్క జానారెడ్డి, మరోపక్క జగ్గారెడ్డి తానే సీఎం అంటూ చేసిన ప్రకటనలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అలాగే ఆ పార్టీలో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ ఇలా అందరూ సీఎంలే అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీలో ఆరేడుగురు సీఎం అభ్యర్థులు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. పోటీలో లేకపోయినా జానారెడ్డి సీఎం పదవిపై ఆశ పడుతున్నారని మంత్రి చెప్పారు.
ఎల్బీనగర్‌లో ఆదివారం నిర్వహించిన బీఆర్‌ఎస్ బూత్ కమిటీల విస్తృతస్థాయి సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఓటేస్తే దుష్ట పాలన వస్తుందని చెప్పారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే కష్టాలు తప్పవని ప్రజలను హెచ్చరించారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు ఓటేసి కర్ణాటక రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు. కర్ణాటక రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని మొత్తుకుంటున్నారని మంత్రి తెలిపారు. కేసీఆర్ పాలన చూసి ఓటేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు.
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాగానే గ్యాస్ సిలిండర్ రూ.400కే అందించనున్నారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఈ విషయాన్ని ఇంటింటా అందరికీ తెలిసేలా వివరించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఇప్పటివరకు రెండు విడతల కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధిని వివరించాలని ఈ సందర్భంగా చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ పనులను కూడా మూడో విడత అధికారంలోకి రాగానే చేపడతామని తెలిపారు. నవంబర్ ఒకటో తేదీ వరకు ప్రతి ఓటరునూ కలిసి వివరించాలని చెప్పారు.