అమిత్ షా కొడుకు క్రికెట్ ఎప్పుడు ఆడారు..?
రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణది అగ్రస్థానమన్న అమిత్‌షా వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని చెప్పారు కేటీఆర్. రైతు సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. గిరిజన యూనివర్శిటీకి భూమి కేటాయించలేదనడం కూడా అబద్ధం అన్నారు.
అమిత్ షా ఆదిలాబాద్ సభపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కేటీఆర్. పరివార్వాద్ అంటూ వారసత్వ రాజకీయాలను అమిత్ షా ఎగతాళి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన నోటివెంట పరివార్వాద్ అనే పదం రావడాన్ని ప్రజలు పరిహాసం చేస్తున్నారని చెప్పారు. అసలు అమిత్ షా కొడుకు క్రికెట్ ఎప్పుడు ఆడారని ప్రశ్నించారు. ఏ క్రికెట్ కప్ సాధించారని ఆయన బీసీసీఐ సెక్రటరీగా ఎంపికయ్యారని నిలదీశారు. అమిత్ షా కొడుకు అనే ఒకే ఒక్క కారణంతో జైషా బీసీసీఐలో పదవి పొందారనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. అబద్ధాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో గుణపాఠం తప్పదన్నారు కేటీఆర్.
మోదీ, అమిత్ షా ఎన్ని అబద్ధాలాడినా.. బీజేపీకి తిరస్కారం తప్పదని చెప్పారు కేటీఆర్. ఆదిలాబాద్ లో అమిత్‌షా ప్రసంగమంతా అబద్దాలేనని అన్నారు. గత ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయినట్టే.. ఈసారి కూడా బీజేపీకి తెలంగాణలో 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతవుతాయని ఎద్దేవా చేశారు.
పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వలేదన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో మత రాజకీయాలు చెల్లవని చెప్పారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణది అగ్రస్థానమన్న అమిత్‌షా వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని చెప్పారు కేటీఆర్. రైతు సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. గిరిజన యూనివర్శిటీకి భూమి కేటాయించలేదనడం కూడా అబద్ధం అన్నారు.
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరిస్తామంటూ ఐదేళ్ల కిందట ఆదిలాబాద్ సభలో అమిత్‌షా ఇచ్చిన హామీ ఏమైంది ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ఇప్పుడు ఆదిలాబాద్ కి వచ్చిన ఆయన.. ఆ హామీ గురించి ఎందుకు ప్రస్తావించలేదన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే సత్తా లేని బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం ప్రజల దురదృష్టం అన్నారు కేటీఆర్. బీజేపీని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరన్నారు. బీఆర్ఎస్ స్టీరింగ్ తమ చేతుల్లోనే ఉందని, బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ చేతుల్లో ఉందని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తున్న పార్టీలను, నేతలను ప్రశ్నించే నైతికత అమిత్ షాకు లేదన్నారు కేటీఆర్.