9నెలల్లో బిడ్డపుడతాడు కానీ, ఫ్యాక్టరీ కట్టగలరా..?

రెండు నెలల్లో తమ రాష్ట్రంలో ఎన్నికలున్నాయని, ఈ ఎన్నికల్లో గెలిచి కంపెనీ ప్రారంభోత్సవానికి మళ్లీ తామే వస్తామని సింటెక్స్ యాజమాన్యానికి అంతే ధీమాగా చెప్పారు కేటీఆర్.

Advertisement
Update:2023-09-28 21:27 IST

రంగారెడ్డి జిల్లా చందనవెల్లి పారిశ్రామిక పార్కులో సింటెక్స్ కంపెనీకి భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 9 నెలల్లో ఫ్యాక్టరీ పూర్తి చేస్తామన్న ఆ కంపెనీ యాజమాన్యం కమిట్ మెంట్ ని అభినందించారు. 9 నెలల్లో బిడ్డపుడతాడు కానీ, ఫ్యాక్టరీ కట్టగలరా అని తాను అనుమానం వ్యక్తం చేశానని, కానీ వారు ధీమాగా కట్టగలం అని చెప్పారని అన్నారు కేటీఆర్. రెండు నెలల్లో తమ రాష్ట్రంలో ఎన్నికలున్నాయని, ఈ ఎన్నికల్లో గెలిచి కంపెనీ ప్రారంభోత్సవానికి మళ్లీ తామే వస్తామని సింటెక్స్ యాజమాన్యానికి అంతే ధీమాగా చెప్పారు కేటీఆర్.


చందనవెల్లి పారిశ్రామిక పార్కులో రూ.350 కోట్ల పెట్టుబడితో సింటెక్స్‌ సంస్థ వాటర్‌ ట్యాంకులు, పీవీసీ పైపుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం కుదుర్చుకొంది. ఈ యూనిట్‌ ద్వారా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వివిధ రకాల పీవీసీ పైపులు, ఫిటింగ్స్‌ తయారీ కోసం రాబోయే మూడేళ్లలో కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెడుతుంది. వెల్‌ స్పన్‌ సంస్థ ఆధ్వర్యంలో సింటెక్స్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు వెల్‌ స్పన్‌ సంస్థను కొత్త యూనిట్‌ ప్రారంభించేలా చేశాయన్నారు మంత్రి కేటీఆర్.


రూ.1200 కోట్ల పెట్టుబడితో కిటెక్స్‌ సంస్థ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్‌ ఫైబర్ టు అపారెల్‌ తయారీ క్లస్టర్‌ కు కూడా మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌ లో రోజుకు 7లక్షల దుస్తుల తయారీ సామర్థ్యంతో కిటెక్స్‌ క్లస్టర్‌ ఏర్పాటవుతోంది. 250 ఎకరాల విస్తీర్ణంలోని ఈ క్లస్టర్‌ ద్వారా దాదాపు 11వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇందులో 80శాతం మంది మహిళలే ఉంటారు. మొత్తం రూ.1200 కోట్లతో 2024 చివరి నాటికి ఈ క్లస్టర్‌ అభివృద్ధి చేస్తారు. 

Tags:    
Advertisement

Similar News