మెట్రోలో కేటీఆర్.. ప్రయాణికులు షాక్

కేరళ నుంచి హైదరాబాద్ చూడటానికి వచ్చిన టూరిస్ట్ ఒకరు మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. తాను ఇంటర్నెట్ లో చూసినదానికంటే హైదరాబాద్ అద్భుతంగా ఉందని చెప్పారు.

Advertisement
Update:2023-11-24 18:37 IST

హైదరాబాద్ మెట్రోలో సడన్ గా ఎంట్రీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఆయన్ను రైలులో చూసినవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఆయనతో మాట కలిపారు. సెల్ఫీలు దిగారు, ఆయనతో మాట్లాడినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల హడావిడిలో నాయకులంతా నియోజకవర్గాల్లో కలియదిరుగుతుంటే.. కేటీఆర్ మాత్రం సరదాగా మెట్రో ఎక్కారు. రాయదుర్గం నుంచి బేగంపేట వరకు ఆయన మెట్రో రైలులో ప్రయాణించారు. హెచ్ఐసిసిలో రియల్ ఎస్టేట్ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న ఆయన.. అనంతరం మెట్రో ఎక్కి బేగంపేటకు చేరుకున్నారు.


20 నిమిషాల ప్రయాణంలో పలువురితో ముచ్చటించారు కేటీఆర్. జర్మనీలో బయోటెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న ఓ యువకుడు కేటీఆర్ తో మాట్లాడారు. జర్మనీతో సమానంగా బయోటెక్నాలజీ రంగంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న తీరుపై ఆ యువకుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ స్థాయికి హైదరాబాద్ ని చేర్చినందుకు కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థినులు, బీటెక్ విద్యార్థినులు.. కేటీఆర్ తో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఐదుగురు విద్యార్థినులు హైదరాబాద్ వచ్చి మెడికల్ కోడింగ్ లో శిక్షణ తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు కేటీఆర్ కి వివరించారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినా కూడా.. విభిన్నమైన రంగంలో స్థిరపడాలనుకుంటున్న వారి ప్రయత్నాన్ని కేటీఆర్ అభినందించారు.

హైదరాబాద్ అద్భుతం..

కేరళ నుంచి హైదరాబాద్ చూడటానికి వచ్చిన టూరిస్ట్ ఒకరు మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. తాను ఇంటర్నెట్ లో చూసినదానికంటే హైదరాబాద్ అద్భుతంగా ఉందని చెప్పారు. హైదరాబాద్ లో పర్యటిస్తుంటే.. విదేశీ నగరంలో ఉన్న అనుభూతి కలిగిందని చెప్పారు. కేటీఆర్ గురించి కేరళలో కూడా చాలామందికి తెలుసని, తెలంగాణకు కిటెక్స్ పరిశ్రమ వచ్చినప్పుడు కేరళలో కూడా ఆయన గురించి చర్చ జరిగిందని చెప్పారు ఆ టూరిస్ట్.

యువతకు అవగాహన..

వివిధ రంగాల వారు, ఉద్యోగులు, యువకులతో కేటీఆర్ మాట్లాడారు. ఈనెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని.. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రోజు పోలింగ్ లో పాల్గొనాలని, తమ హక్కు వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ రోజు ఒక గంట సమయం కేటాయిస్తే.. మరో ఐదేళ్లు మంచి నాయకులకు పాలించే అవకాశం ఇవ్వొచ్చని చెప్పారు. మెట్రో స్టాఫ్ కూడా మంత్రి కేటీఆర్ తో కరచాలనం చేసేందుకు, ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపించారు. 

Tags:    
Advertisement

Similar News