ఆ నిబంధనలు బీజేపీకి వర్తించవు.. కేటీఆర్ సెటైర్లు..
ఆ ఆరోపణలను దులిపేసుకుంటూ పోతోంది బీజేపీ. తాజాగా డెరెక్ వేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దానికి కేటీఆర్ ఇచ్చిన రియాక్షన్, బీజేపీకి మరింత చురుకు పుట్టించేలా ఉంది.
"డెరెక్..! ఆ మాట చెప్పడానికి మీకు ఎంత ధైర్యం..? బీజేపీలో ఉన్నవారికి వారసత్వ వాసనలు, అవినీతి మకిలి అంటదని మీకు తెలియదా..? వారసత్వ నియమాలు, నీతి బోధనలు అన్నీ పక్క పార్టీ వాళ్లకు మాత్రమే, బీజేపీకి వర్తించవు." అంటూ పొద్దు పొద్దున్నే బీజేపీకి మంట పెట్టారు మంత్రి కేటీఆర్. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ట్వీట్ కి ఆయన సమాధానమిస్తూ ఈ కామెంట్ చేశారు.
డెరెక్ వేసిన ట్వీట్ ఏంటి..?
బీజేపీ వారసత్వ రాజకీయాలపై అదిరిపోయే ట్వీట్ వేశారు టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్. 18మంది బండారాన్ని బయటపెట్టారు. ముందుగా అమిత్ షా తనయుడు జై షా తో మొదలు పెట్టారు డెరెక్.
నా పేరు జై షా, మళ్లీ నేను బీసీసీఐ కార్యదర్శి అయ్యాను, మా నాన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.
నా పేరు అరుణ్ సింగ్ ధుమాల్, నేను IPL కొత్త చైర్మన్ ని. నా పెద్దన్నయ్య కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.
ఇలా.. 18మందికి సంబంధించిన ఓ లిస్ట్ తయారు చేశారు డెరెక్. ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు. కేంద్రంలో ఉన్నవారితో వారికి ఉన్న సంబంధం ఏంటనేది విపులంగా వివరించారు. మేమంతా బీజేపీకి చెందిన పరివార్వాద్ ముక్త్ భారత్ సభ్యులం అంటూ వ్యంగ్యంగా ఓ క్యాప్షన్ పెట్టారు. రాజ్ నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్, జితేంద్ర ప్రసాద.. ఇలా అందరి జాతకాలు బయటపెట్టారాయన.
ఇటీవల భారత స్వాతంత్ర దినోత్సవ 75వ వసంతం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీ వారసత్వ రాజకీయాలపై చెణుకులు విసిరారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం అని చెప్పారు. అప్పటినుంచీ బీజేపీ వారసత్వాలపై గట్టిగా కౌంటర్లు పడుతున్నాయి. కానీ ఆ ఆరోపణలను దులిపేసుకుంటూ పోతోంది బీజేపీ. తాజాగా డెరెక్ వేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దానికి కేటీఆర్ ఇచ్చిన రియాక్షన్, బీజేపీకి మరింత చురుకు పుట్టించేలా ఉంది.