సక్కగ పని చేస్తే సమస్యలెందుకు? యాత్రలెందుకు..?
కాంగ్రెస్ లో ఒకాయన రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడని, 750 కిలోమీటర్లు తిరిగానని గొప్పలు చెప్పుకుంటున్నాడని, అసలాయన్ని ఎవరు తిరగమన్నారని, అంత గోస ఆయనకు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.
50 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్లు సక్కగా పని చేస్తే ఈ సమస్యలు ఎందుకుంటాయ్, ఈ యాత్రలు ఎందుకు..? అంటూ సూటిగా ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. 50 నుంచి 55 ఏళ్లపాటు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించింది కాంగ్రెస్ కాదా అని అడిగారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందు తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంటి? ఆడబిడ్డల పరిస్థితి ఏంటి? తాగు, సాగునీటి పరిస్థితేంటి? ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ లో ఒకాయన రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడని, 750 కిలోమీటర్లు తిరిగానని గొప్పలు చెప్పుకుంటున్నాడని, అసలాయన్ని ఎవరు తిరగమన్నారని, అంత గోస ఆయనకు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. 15రోజల కిందట కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేసుకుంటూ జడ్చర్లకు వచ్చి మంచి మనిషి లక్ష్మారెడ్డిని నోటికి వచ్చినట్టు తిట్టిపోయారన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడికి నోటిదూల ఎక్కువంటూ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. గతంలో తిట్టిపోతే లక్ష్మారెడ్డికి 45వేల మెజార్టీ ఇచ్చారని, ఈసారి 90వేలకుపైగా మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పరిపాలనలో తాగునీటి కోసం గోస పడేవాళ్లమని గుర్తు చేశారు కేటీఆర్. మహబూబ్ నగర్ లో 14 రోజులకొకసారి తాగునీరు వచ్చేదన్నారు. జడ్చర్లలో పరిస్థితులు ఎలా ఉండేవో అందరికీ తెలుసన్నారు. ఎండాకాలంలో ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు గ్రామాల్లోకి రావాలంటే భయపడుతుండేవారని, ఏ ఊరికి వెళ్తే బిందెలు అడ్డం పెడతారో అని రాకుండా మానేసేవారని చెప్పారు. ఇప్పుడు మిషన్ భగీరథతో కడుపునిండా నీళ్లు వస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు కేటీఆర్.
75ఏళ్లలో ఏ కాంగ్రెస్ సన్నాసి నాయకుడు చేయని ఆలోచన చేసి రూ.43వేల కోట్లతో ఇంటింటికి నల్లా పెట్టించిన ఘనత సీఎం కేసీఆర్ ది అని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ బంజారాహిల్స్ లో దొరుకుతున్న నీళ్లు, జడ్చర్లలో బంజారాతండాలో వస్తున్నాయని చెప్పారు. పాలమూరు - రంగారెడ్డి పథకాన్ని కాంగ్రెస్ పట్టించుకోకపోగా.. తెలంగాణ వచ్చాక కేసులు వేసి అడ్డుకోబోయారని, బీజేపీ వాళ్లు కృష్ణా జలాలు పంచకపోయినా ఆ ప్రాజెక్ట్ ని సీఎం కేసీఆర్ పట్టుదలతో పూర్తి చేయించారని అన్నారు కేటీఆర్.