సీటుకు రేటు రేవంత్.. రాష్ట్రాన్ని అమ్మడం పక్కా
కేసీఆర్‌ను కొట్టడానికి ఇంత మంది తెలంగాణకు రావాలా అని ప్రశ్నించారు. ఎంతమంది గుంపులు గుంపులుగా వచ్చినా.. సీఎం కేసీఆర్ సింహంలాంటి వారని ఆయన సింగిల్ గానే వస్తారని చెప్పారు కేటీఆర్.
ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ అయ్యాక సీటుకు రేటు కట్టి అమ్మేస్తున్నారని, రేపు పొరపాటున రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రేటు కట్టి అమ్మేయడం పక్కా అని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ కి చెందిన పలువురు నేతలు ఆయన సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. పాలకుర్తి నుంచి తిరుపతిరెడ్డి, గద్వాల్ నుంచి కురువ విజయ్ కుమార్, ముథోల్ కు చెందిన కిరణ్ వాగ్మోరేతో పాటు జనగామ నేతల్ని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు కేటీఆర్. వారికి గులాబి కండువాలు కప్పారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్.
నాడు మహబూబ్ నగర్ అంటే మైగ్రేషన్ అని.. ప్రస్తుతం మహబూబ్ నగర్ అంటే ఇరిగేషన్ అనే పేరు పడిపోయిందని చెప్పారు మంత్రి కేటీఆర్. 14.50లక్షల ఎకరాలకు పాలమూరులో నీరందుతోందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. ఈ అభివృద్ధిని నిలబెట్టుకోవాలంటే మరోసారి కేసీఆర్ కే పట్టం కట్టాలని చెప్పారు. బీఆర్ఎస్ ని కాదని ఎవరికి అధికారం అప్పగించినా రాష్ట్రం వెనక్కి వెళ్లడం ఖాయమన్నారు కేటీఆర్.
సింహం సింగిల్ గానే..
ప్రధాని నరేంద్ర మోదీ బీసీ గర్జన సభకోసం తెలంగాణకు వచ్చారని, ఆయనే కాకుండా తెలంగాణ ఎన్నికలకోసం 15 రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేతలు అంతా ఇక్కడికి క్యూకట్టారన్నారు కేటీఆర్. కేసీఆర్‌ను కొట్టడానికి ఇంత మంది తెలంగాణకు రావాలా అని ప్రశ్నించారు. ఎంతమంది గుంపులు గుంపులుగా వచ్చినా.. సీఎం కేసీఆర్ సింహంలాంటి వారని ఆయన సింగిల్ గానే వస్తారని చెప్పారు కేటీఆర్.