ప్రవల్లిక కుటుంబానికి మంత్రి కేటీఆర్ భరోస
ప్రవల్లిక కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేమని అన్నారు. ప్రవల్లిక మరణానికి కారణమైన వ్యక్తిని పట్టుకొని, చట్టపరంగా శిక్ష పడేలా చూస్తామని కేటీఆర్ చెప్పారు.
హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ హాస్టల్‌లో ఉరేసుకొని చనిపోయిన వరంగల్ విద్యార్థిని మర్రి ప్రవల్లిక కుటుంబానికి మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. ప్రవల్లిక కుటుంబ సభ్యులు బుధవారం ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను కలిశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..
ప్రవల్లిక కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేమని అన్నారు. ప్రవల్లిక మరణానికి కారణమైన వ్యక్తిని పట్టుకొని, చట్టపరంగా శిక్ష పడేలా చూస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రవల్లిక కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటామని.. తమ్ముడికి ఉద్యోగం ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ కరీంనగర్‌లో జరిగిన సభలో కూడా వెల్లడించారు. ప్రవల్లిక మరణం చాలా దురదృష్టకరమని, కానీ ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేస్తున్నాయని అన్నారు. అమ్మాయిని వేధించి, ఆమె చావుకు కారణం అయిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి సంఘటనలు మున్ముందు జరగకుండా చూస్తామని కేటీఆర్ చెప్పారు.
ఇక మంత్రి కేటీఆర్‌ను కలిసిన అనంతరం ప్రవల్లిక తమ్ముడు ప్రణయ్ మాట్లాడుతూ.. అక్క మరణానికి సంబంధించిన కేసు పురోగతిపై డీజీపీ మహేందర్ రెడ్డితో కేటీఆర్ మాట్లాడారని చెప్పాడు. తమ కుటుంబానికి అండగా ఉంటానని కేటీఆర్ భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నాడు. తమను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారని అన్నారు. మంత్రి కేటీఆర్‌ను కలిసిన తర్వాత తప్పకుండా అక్కకు న్యాయం జరుగుతుందనే ధీమా పెరిగిందని ప్రణయ్ పేర్కొన్నాడు.