విజన్ 2047 సరే.. 2022 వాగ్దానాల సంగతేటి మోదీజీ..
యావత్ భారత జాతి మీ నుంచి సమాధానం కావాలని కోరుకుంటోందని చెప్పారు. లక్ష్యాల సాధనలో మీ వైఫల్యాలను మీరే గుర్తించకపోతే ఇక జవాబుదారీతనం ఎక్కడని ప్రశ్నించారు కేటీఆర్.
స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మోదీ ప్రసంగం అంతా 2047 చుట్టూ తిరిగింది. 2047నాటికి అభివృద్ధి చెందిన భారత్ ని చూస్తామని, ఆ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు మోదీ. ఆ విజన్ బాగానే ఉంది కానీ, మరి 2022 విజనరీ గురించి గతంలో మీరిచ్చిన హామీల సంగతేంటని ప్రధాని మోదీని ప్రశ్నించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. యావత్ భారత జాతి మీ నుంచి సమాధానం కావాలని కోరుకుంటోందని చెప్పారు. లక్ష్యాల సాధనలో మీ వైఫల్యాలను మీరే గుర్తించకపోతే ఇక జవాబుదారీతనం ఎక్కడని ప్రశ్నించారు కేటీఆర్.
క్యాహువా తేరా వాదా అనే హ్యాష్ ట్యాగ్ తో 2022 లక్ష్యాలను వివరిస్తూ మోదీ ఇచ్చిన కొన్ని వాగ్దానాల పేపర్ కటింగ్స్ ని ఈ సందర్భంగా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు మంత్రి కేటీఆర్.
- 2022 నాటికి దేశంలోని ప్రతి పేదవాడికీ సొంత ఇల్లు.
- 2022 నాటికి ప్రతి రైతుకీ రెట్టింపు ఆదాయం
- 2022 నాటికి భారత జాతీయ ఆదాయం రెట్టింపు
- ప్రతి ఇంటికీ నీరు, విద్యుత్, మరుగుదొడ్డి అనే లక్ష్యానికి డెడ్ లైన్ 2022
- 2022 కల్లా భారత్ లో ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం
- 2022 నాటికి భారత్ లో బుల్లెట్ ట్రైన్ కల సాకారం..
ఇలా 2014, 2019 ఎన్నికల్లో మోదీ హామీలు గుప్పించిన విషయాన్ని మరోసారి సోషల్ మీడియా వేదికగా గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. ఇటీవల క్యాహువా తేరా వాదా అంటూ మోదీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే మొదలైంది. మోదీ చేసిన వాగ్దానాలన్నిటికీ 2022 ఎక్స్ పయిరీ డేట్ కాగా.. ఇప్పటికీ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోవడం దారుణం. అయితే ఇప్పుడు కొత్తగా ఆయన 2047 వందేళ్ల భారతావని అనే పల్లవి అందుకున్నారు. విడివిడిగా హామీలు ఇవ్వడం దేనికని, ఏకంగా అభివృద్ధి చెందిన భారత్ ని సాక్షాత్కరింపజేస్తామని సెలవిచ్చారు. ప్రధాని మోదీ పాత హామీలను గాలికొదిలేసి, విజన్ 2047 అనే లక్ష్యాన్ని నిర్దేశించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.