మహారాష్ట్ర ఓటమితోనైనా బుద్ధి తెచ్చుకోండి

ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయండి : మాజీ మంత్రి హరీశ్‌ రావు

Advertisement
Update:2024-11-24 17:11 IST

మహారాష్ట్రలో ఓటమి తర్వాతనైనా కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు బుద్ధి తెచ్చుకోవాలని, వంద రోజుల్లోనే అమలు చేస్తామన్న హామీలపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి, ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి పట్టపగలు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని, ఆయన ఆడిన అబద్ధాలకు డబుల్‌ పీహెచ్‌డీ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. కర్నాటక, తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టే మహారాష్ట్ర ప్రజలను గ్యారంటీల పేరుతో మోసం చేయాలని చూశారని.. అక్కడి ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ మోసాన్ని గుర్తించి ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు. కేసీఆర్‌ హుజూరాబాద్‌ లో 18,500 కుటుంబాలకు దళితబంధు ఇచ్చారని.. వారిలో కొందరికి రెండో విడత డబ్బులు మంజూరు చేయాలని కోరితే ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై ప్రభుత్వం అరాచకానికి తెగపడిందన్నారు. కొత్త పథకాల సంగతి దేవుడెరుగు.. కేసీఆర్‌ ఇచ్చిన పథకాలనే ఎత్తేశారని అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ఉండి దళితులకు చేసే మేలు ఇదేనా అని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడానికి ముఖ్యమంత్రికి సిగ్గుండాలని.. ఫార్మా విలేజ్‌ కోసమని జూలై 19న గెజిట్‌ తెచ్చి ఇప్పుడు ఇండస్ట్రియల్‌ క్లస్టర్‌ అంటున్నాడని.. అది నిజమే అని నమ్మాలంటే గతంలో ఇచ్చిన గెజిట్‌ వాపస్‌ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పచ్చటి పొలాలను తొండలు గుడ్లు పెట్టని భూములు అని మభ్య పెట్టే ప్రయత్నం చేసిన సీఎం.. రైతుల దగ్గరికి వెళ్లి వారి సమస్య పరిష్కరించాలన్నారు.

కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేస్తున్న రేవంత్‌ రెడ్డి.. ఆ ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్‌, కొండిపోచమ్మ సాగర్‌ ల నుంచి 20 టీఎంసీలు హైదారబాద్‌ తాగునీటి కోసం ఎలా తీసుకుంటారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరంలో భాగమైన మల్లన్నసాగర్‌, రంగనాయకసాగర్‌ నుంచి వాళ్ల ప్రభుత్వంలోని మంత్రే ఆయకట్టుకు నీళ్లు విడుదల చేశారని గుర్తు చేశారు. కాళేశ్వరం నీళ్లతోనే మూసీ పునరుజ్జీవం, ఆ ప్రాజెక్టు నీళ్లతోనే హైదరాబాద్‌ కు తాగునీరు ఇస్తామని చెప్తూనే కాళేశ్వరంపై విష ప్రచారం చేయడం రేవంత్‌ కే చెల్లిందన్నారు. రేవంత్‌ అబద్ధాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. మిషన్‌ భగీరథ ఫెయిల్‌ అన్న రేవంత్‌ హైదరాబాద్‌ కు తాగునీళ్లు ఇచ్చే ప్రాజెక్టు విషయంలో భగీరథ అధికారులతో కో ఆర్డినేట్‌ చేసుకోవాలని ఆదేశిస్తున్నారని అంటే ఎవరు ఫెయిలో తెలిసి పోతుందన్నారు. 2014లో 30 లక్షల టన్నుల వడ్లు పండితే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దానిని 1.41 కోట్ల టన్నులకు పెంచి ధాన్యాగారంగా మార్చామని.. ఇప్పుడు రేవంత్‌ 1.61 కోట్ల టన్నుల వడ్లు పండటం తమ గొప్పతనమని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. కేసీఆర్‌ అమలు చేసిన రైతాంగ అనుకూల విధానాలతోనే రాష్ట్రంలో వడ్ల సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. కేసీఆర్‌ వ్యవసాయన్ని పండుగ చేశారు కాబట్టే దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. భూమికి బరువయ్యేలా పంటలు పండించామని, రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేశామన్నారు. రైతుబంధు, రుణమాఫీ ఎగ్గొట్టారని.. ఏం చేశారని రైతు వారోత్సవాలు జరుపుతారో చెప్పాలన్నారు. అసెంబ్లీలో దళితుల పక్షాన పోరాడుతామన్నారు.

Tags:    
Advertisement

Similar News