పది నెలల్లో ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఇదే
స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా సత్తా చాటుదాం.. జగిత్యాల నాయకుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత
దేశ చరిత్రలోనే పది నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యధిక ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో జగిత్యాల నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, వైఫల్యాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుదామని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో వాట్సప్ గ్రూప్‌లు, సోషల్ మీడియా వేదికలు సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేయాలని సూచించారు. జగిత్యాలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఒక్క నియోజకవర్గానికే 4,500 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయించానని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ పార్టీని వీడినా కార్యకర్తలంతా పార్టీతోనే ఉన్నారని తెలిపారు. పార్టీ మారిన వాళ్లు ఎమ్మెల్యే పదవికి రాజీమా చేయకుండా గోడమీద పిల్లిలా ఉండటం అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం లాంటిదేనని అన్నారు. అలాంటి వాళ్లను ప్రజలు క్షమించరని అన్నారు. అందరం కలిసికట్టుగా పని చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదామని, గ్రామగ్రామాన గులాబీ జెండా ఎగరేద్దామని పిలుపునిచ్చారు.
రేపు డెడికేటెడ్ కమిషన్‌కు నివేదిక
రాష్ట్రంలో కుల గణన కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ కు సోమవారం ఉదయం 11 గంటలకు నివేదిక అందజేద్దామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తన నివాసంలో వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, నాయకులతో ఆమె సమావేశమయ్యారు. యునైటెడ్ ఫూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహించిన వివిధ సమావేశాల్లో తమ దృష్టికి వచ్చిన అంశాలు, రాష్ట్రంలో బీసీలకు కల్పించాల్సిన రాజకీయ ప్రాధాన్యత సహా అన్ని అంశాలతో కూడిన సమగ్ర నివేదికను డెడికేటెడ్ కమిషన్‌కు అందజేస్తామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, బీసీ నాయకులు గట్టు రాంచందర్ రావు, బొల్లా శివశంకర్, ఆలకుంట హరి, ఉపేందర్, మఠం భిక్షపతి, రాజారాం యాదవ్, దావ సురేష్ తదితరులు పాల్గొన్నారు.