సెప్టెంబర్-17 జాతీయ సమైక్యతా దినం -కేటీఆర్

అవకాశవాదులు చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి విచ్ఛిన్నకర శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్.

Advertisement
Update:2023-09-10 15:54 IST

దేశమంతటికీ ఆగస్ట్-17న స్వాతంత్రం వచ్చినా నిజాం ఏలుబడిలోని తెలంగాణ ప్రాంతానికి మాత్రం సెప్టెంబర్-17న విముక్తి లభించింది. దేశంలో ఏయే ప్రాంతాలకు ఎప్పుడు స్వాతంత్రం వచ్చినా ఉమ్మడిగా ఆగస్ట్-15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. అయితే తెలంగాణ ఏర్పాటైన తర్వాత సెప్టెంబర్-17న హడావిడి పెరిగిపోయింది. ఆ రోజుని తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రతి ఏడాదీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది బీజేపీ. కాంగ్రెస్ కూడా విమోచనం అనే పల్లవి అందుకుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఆ రోజుని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలంటుంది. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ సెప్టెంబర్ 17న ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు.

సెప్టెంబర్-17న పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేసింది. ఈ సభకు అమిత్ షా చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. ఇక హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ మీటింగ్ లు పెట్టుకుంటున్న కాంగ్రెస్ కూడా సెప్టెంబర్-17న విమోచన హడావిడి చేయాలనుకుంటోంది. సోనియాగాంధీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో భారీ ర్యాలీ చేపట్టబోతోంది. ఇటీవల టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. విమోచన దినోత్సవం విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయాలనుకుంటున్నారు. దీంతో మంత్రి కేటీఆర్, కిషన రెడ్డికి పరోక్షంగా ఘాటు రిప్లై ఇచ్చారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పదేళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జోడెడ్లుగా పరిగెత్తిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచామని చెప్పారు మంత్రి కేటీఆర్. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేసే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలు సంబరంగా జరుపుకునే జాతీయ సమైక్యత దినోత్సవంపై కొన్ని పార్టీలు రాజకీయ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రతి అంశానికి మతాన్ని జోడించి సమాజంలో చిచ్చుపెట్టే విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలన్నారు కేటీఆర్.

1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజని, రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన రోజని అన్నారు మంత్రి కేటీఆర్. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే ఎత్తుగడలకు విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. అవకాశవాదులు చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి విచ్ఛిన్నకర శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ప్రజలకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News