గద్వాల్ ఎమ్మెల్యే మావాడు.. కాదు మావాడే
జూపల్లి బుజ్జగింపులకు బండ్ల కరుగుతారా..? తిరిగి కాంగ్రెస్ లోనే ఉంటానని ప్రకటిస్తారా..? అనేది తేలాల్సి ఉంది.
రాజకీయాల్లో ఫిరాయింపులు సహజమే కానీ, తెలంగాణలో మాత్రం ఇవి ఎవరి అంచనాలకు అందకుండా ఉన్నాయి. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తీరు చూస్తే మరీ ఇంత స్పీడ్ గా అభిప్రాయాలు మారిపోతాయా అనే అనుమానం వస్తుంది. మొన్న బీఆర్ఎస్ నేతలతో కలసి ఉన్న ఎమ్మెల్యే బండ్ల, నేడు కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి అల్పాహారం స్వీకరించారు. దీంతో బండ్ల ప్రయాణంపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.
గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత మళ్లీ మనసు మార్చుకుని బీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు. కేటీఆర్ సహా ఇతర నేతలతో కలసి కూర్చుని మాట్లాడారు. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు.
రోజుల వ్యవధిలోనే మళ్లీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ నేతల్ని కలవడం సంచలనంగా మారింది. మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవతోనే ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడాయన బీఆర్ఎస్ లోకి తిరిగి వెళ్తారంటున్న వార్తల నేపథ్యంలో మళ్లీ జూపల్లి తెరపైకి వచ్చారు. బండ్లతో చర్చలు జరుపుతున్నారు. ఆయన ఇంటికి వెళ్లి, ఆయనతో కలసి కూర్చునిబ్రేక్ ఫాస్ట్ చేశారు. జూపల్లి బుజ్జగింపులకు బండ్ల కరుగుతారా..? తిరిగి కాంగ్రెస్ లోనే ఉంటానని ప్రకటిస్తారా..? అనేది తేలాల్సి ఉంది.