ఎమ్మెల్యే అలా మాట్లాడితేనే కదా.. కుట్ర తెలిసేది- మంత్రి జగదీష్ రెడ్డి
ఇప్పుడు అమిత్ షాను తీసుకొచ్చి బండి సంజయ్ ప్రమాణం చేయించగలరా అని ప్రశ్నించారు మంత్రి జగదీష్‌రెడ్డి. పైలట్ రోహిత్ రెడ్డి నిందితులతో కాస్త చనువుగా మాట్లాడడాన్ని జగదీష్ రెడ్డి తప్పుపట్టలేదు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ప్రమాణం చేస్తానని హడావుడి చేసిన బండి సంజయ్ ఇప్పుడు బొక్కబోర్లా పడ్డారని వ్యాఖ్యానించారు మంత్రి జగదీష్ రెడ్డి. రామచంద్ర భారతి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య జరిగిన ఆడియో సంభాషణ టేపులు బయటకు వచ్చిన తర్వాత స్పందించిన జగదీష్ రెడ్డి.. మునుగోడు ప్రచారానికి వచ్చిన సమయంలో నెల రోజుల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అమిత్ షా అన్నారని.. ఆ ఆపరేషన్‌ను బీజేపీ మొదలుపెట్టిందన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిజాయితీ పరులు కాబట్టే బీజేపీ ఆపరేషన్ బెడిసికొట్టిందన్నారు.
ఇప్పుడు అమిత్ షాను తీసుకొచ్చి బండి సంజయ్ ప్రమాణం చేయించగలరా అని ప్రశ్నించారు మంత్రి జగదీష్‌రెడ్డి. రోహిత్ రెడ్డి నిందితులతో కాస్త చనువుగా మాట్లాడడాన్ని జగదీష్ రెడ్డి తప్పుపట్టలేదు. నిందితుల్లో నమ్మకం కలిగించేలా మాట్లాడితేనే కదా వారి కుట్రలకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చేది అని వ్యాఖ్యానించారు. రోహిత్ రెడ్డి ఆ పనే చేశారని, అందులో ఎమ్మెల్యేలను తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. దొంగలను పట్టించడంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు విజయవంతమయ్యారని జగదీష్ రెడ్డి కితాబిచ్చారు.
బండి సంజయ్ అనే వ్యక్తి బండి కింద పోయే శునకం లాంటి వాడదని.. అతడి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడిలాగా బండి సంజయ్ హడావుడి ఉంటుందన్నారు.