జిల్లాకో మెడికల్ కాలేజీతో రికార్డు సృష్టించాలి.. - మంత్రి హరీష్ రావు
గత ప్రభుత్వాలు 60 ఏండ్లలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొమ్మిదేండ్లలోనే 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తుచేశారు.
8 జిల్లాల్లో వచ్చే ఏడాది కల్లా మెడికల్ కాలేజీలు ప్రారంభించేలా ప్రతిపాదనలు, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి భూసేకరణ, ఇతర పనులను వేగవంతం చేయాలన్నారు. ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఎన్‌ఎంసీ మార్గదర్శకాల ప్రకారం కాలేజీలు ఏర్పాటు చేయాలని సూచించారు.
సచివాలయంలో శుక్రవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గానూ ఇప్పటివరకు 25 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. మిగతా 8 జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పాన్ని పూర్తి చేయాలన్నారు.
గత ప్రభుత్వాలు 60 ఏండ్లలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొమ్మిదేండ్లలోనే 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తుచేశారు. అతి తక్కువ సమయంలో 21 కాలేజీలు ప్రారంభించి దేశంలోనే రికార్డు సృష్టించామని చెప్పారు. ఆయా కాలేజీలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం నడిచేలా చూడాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లపైన ఉందన్నారు మంత్రి హరీష్‌రావు.