మీ ఇల్లే సరిగా లేదు.. మాకు నీతులు చెబుతారా..?

రాష్ట్రంలో బ్రిజేష్ ట్రిబ్యునల్ పంచాయితీ ఉందని.. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎటు వైపు ఉంటారని ప్రశ్నించారు. కాళ్ళు మొక్కేవాళ్లు, అడుగులకు మడుగులొత్తే వాళ్ళు తెలంగాణ ప్రయోజనాలను ఎలా కాపాడగలరని ప్రశ్నించారు హరీష్ రావు.

Advertisement
Update:2023-11-11 13:07 IST

తెంలగాణలో కర్నాటక నేతల ప్రచారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. మీ ఇల్లే సరిగా లేదు ఇక్కడికి వచ్చి మాకు నీతులు చెబుతారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే కంట్రోల్ అంతా ఢిల్లీలో, కర్నాటకలో ఉంటుందన్నారు. కర్నాటకలో ప్రతి రోజు ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అక్కడి నేతలు ఏ మొహం పెట్టుకుని తెలంగాణలో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కర్నాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడంపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ నాయకులకు ఏం చూసి ఓట్లు వేయాలన్నారు. తమ రాష్ట్రంలో 5 గంటలే కరెంటు ఇస్తున్నామని డీకే శివకుమారే స్వయంగా ఒప్పుకున్నారని, అలాంటి పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే 24గంటలు కరెంటు ఎలా ఇస్తుందన్నారు హరీష్ రావు.

కాంగ్రెస్ పార్టీలో టికెట్లు కావాలంటే ఢిల్లీకి, డబ్బులు కావాలంటే కర్నాటకు వెళ్లాలని.. ప్రచారం కోసం ఇతర రాష్ట్రాల నుంచి నాయకులు రావాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు హరీష్ రావు. కృష్ణా జలాలు, ఐటీ వివాదాలు వస్తే కర్నాటక ప్రభుత్వాన్ని ధిక్కరించి తెలంగాణ హక్కులను కాంగ్రెస్ పార్టీ కాపాడగలదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బ్రిజేష్ ట్రిబ్యునల్ పంచాయితీ ఉందని.. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎటు వైపు ఉంటారని ప్రశ్నించారు. కాళ్ళు మొక్కేవాళ్లు, అడుగులకు మడుగులొత్తే వాళ్ళు తెలంగాణ ప్రయోజనాలను ఎలా కాపాడగలరని ప్రశ్నించారు. తెలంగాణ రక్షణ, హక్కుల సాధన కేసీఆర్ వల్లే సాధ్యం అవుతుందన్నారు హరీష్ రావు. తెలంగాణ అభివృద్ధి కూడా కేసీఆర్ తోనే సాధ్యమని, ఒక్క ఛాన్స్ అనే మాటల్ని నమ్మి మోసపోవద్దని సూచించారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖామమని ధీమా వ్యక్తం చేశారు. 

Tags:    
Advertisement

Similar News