హైదరాబాద్ లో రూ.15వేల కోట్లతో మైక్రోసాఫ్ట్ డేటా కేంద్రం..
ప్రపంచం కొత్త సాంకేతికతవైపు పరుగులు తీస్తోందని, ఈ పరుగులో తెలంగాణ ముందంజలో ఉందని అన్నారు సత్య నాదెళ్ల. ఐటీ రంగంలో రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తోందని కితాబిచ్చారు.
బిజినెస్, బిర్యానీ గురించి సత్య నాదెళ్లతో మాట్లాడానంటూ మంత్రి కేటీఆర్ సరదాగా ట్వీట్ చేసినా.. ఆ సమావేశం తెలంగాణ ఐటీ అభివృద్ధి దిశగా సుదీర్ఘంగా సాగింది. హైదరాబాద్‌లో రూ.15 వేల కోట్లతో మైక్రోసాఫ్ట్ ఏర్పాటుచేస్తున్న అతిపెద్ద డేటా కేంద్రం 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల. ఈ కేంద్రానికి సంబంధించిన పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. తెలంగాణలో స్టార్టప్ లు, ఐటీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణపై నాదెళ్ల ప్రశంసలు..
ప్రపంచం కొత్త సాంకేతికతవైపు పరుగులు తీస్తోందని, ఈ పరుగులో తెలంగాణ ముందంజలో ఉందని అన్నారు సత్య నాదెళ్ల. ఐటీ రంగంలో రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తోందని కితాబిచ్చారు. భారతీయులు త్వరలోనే ఐటీలో ఆధిపత్యం వహించే స్థాయికి చేరుకుంటారన్నారు. టీహబ్ రెండో దశను ప్రారంభించడం అభినందనీయమని చెప్పారు. తెలంగాణలో విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
కేటీఆర్ ఏమన్నారంటే..?
తెలంగాణ ప్రభుత్వ సానుకూల విధానాలతో డేటా సెంటర్స్ ఏర్పాటు కోసం దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని చెప్పారు మంత్రి కేటీఆర్. మైక్రోసాఫ్ట్ 15వేల కోట్లతో, అమెజాన్ 36 వేల కోట్ల రూపాయలతో అతిపెద్ద డేటా కేంద్రాలను స్థాపిస్తోందని వివరించారు. అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ గొప్ప సహకారాన్ని అందిస్తోందన్నారు. రెండో అతిపెద్ద ఆఫీస్ ని ప్రారంభించడంతో పాటు, డేటా కేంద్రం ఏర్పాటుకు ముందుకు రావడం, వివిధ రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి సహకరించడంపై ప్రభుత్వం తరఫున మైక్రోసాఫ్ట్ సంస్థకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో సానుకూలతల దృష్ట్యా మరిన్ని పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నట్టు చెప్పారు కేటీఆర్. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా జిల్లాల్లో కూడా సాంకేతిక అభివృద్ధి, మైక్రోసాఫ్ట్ శిక్షణ కార్యక్రమాలు, క్లౌడ్ టెక్నాలజీతో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి తదితర అంశాలపై కూడా మంత్రి కేటీఆర్, సత్య నాదెళ్లతో చర్చించారు. హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ ఏర్పాటు గురించి కేటీఆర్ ఆయనకు వివరించారు.