హైదరాబాద్‌కు మహర్ధశ.. రూ.69 వేల కోట్లతో నలువైపులా మెట్రో విస్తరణ

రాబోయే 3 నుంచి 4 ఏళ్లలో భారీ ఎత్తున మెట్రో లైన్ల విస్తరణ పూర్తి చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.

Advertisement
Update:2023-07-31 21:04 IST

తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరచాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మెట్రోను నగరం చుట్టుపక్కలకు మరింతగా విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం జరగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో మెట్రో విస్తరణకు పచ్చ జెండా ఊపారు. దీనికి సంబంధించిన వివరాలను మున్సిపల్ మంత్రి కేటీఆర్ విలేకరు సమావేశంలో వెల్లడించారు.

రాబోయే 3 నుంచి 4 ఏళ్లలో భారీ ఎత్తున మెట్రో లైన్ల విస్తరణ పూర్తి చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు ఎయిర్‌పోర్ట్ మెట్రోను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా దాదాపు పూర్తి అయినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. నగరంలో ఇప్పటికే 70 కిలోమీటర్ల మేర మెట్రో ఉండగా.. దానికి అదనంగా 31 కిలోమీటర్ల ఎయిర్‌పోర్ట్ మెట్రో రానున్నది. దీనికి తోడుగా దూర ప్రాంత ప్రజలకు మెట్రో కనెక్టివిటీనీ అందించాలని కేబినెట్‌లో నిర్ణయించారు.

జూబ్లీ బస్టాండ్ నుంచి తూంకుంట వరకు, ప్యాట్నీ నుంచి కండ్లకోయ ఓఆర్ఆర్ వరకు డబుల్ డెక్కర్ మెట్రోను నిర్మించనున్నారు. ఒక లెవెల్‌లో వాహనాలు వెళ్లేందుకు అనుకూలమైన ఫ్లైవోవర్.. దానిపై మెట్రో లైన్ నిర్మిస్తారు. దీన్ని డబుల్ డెక్కర్ మెట్రోగా పిలుస్తున్నారు. దీని వల్ల ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించవచ్చని మంత్రి కేటీఆర్ చెప్పారు. దీని వల్ల రాజీవ్ రహదారి రూట్, అదిలాబాద్ రూట్‌లో మెట్రో అందుబాటులోకి రానున్నది. ఈ రెండు రూట్లలో రక్షణ శాఖకు సంబంధించిన భూములు ఉన్నాయి. కాబట్టి కేంద్ర రక్షణ శాఖను ఈ మేరకు భూముల బదిలీపై చర్చించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు.

మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రోను విస్తరించనున్నారు. అలాగే మియాపూర్ నుంచి లకిడీకపూల్ వరకు మరో కొత్త మార్గంలో మెట్రోను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఎల్బీనగర్ వరకు ఉన్న మెట్రో రూట్‌ను పెద అంబర్‌పేట్ వరకు విస్తరించనున్నారు. అలాగే ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకు కొత్తగా మెట్రో నిర్మించనున్నారు. భవిష్యత్‌లో శంషాబాద్ నుంచి కొత్తూరు మీదుగా షాద్‌నగర్ వరకు మెట్రోను నిర్మించడానికి కూడా అవకాశాలు ఉన్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఓల్డ్ సిటీ మెట్రోను పూర్తి చేయడంతో పాటు.. ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ వరకు కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి కందుకూరు (ఫార్మా సిటీ) వరకు మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో పాటు ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో మార్గం ఏర్పాటు చేయడానికి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మెట్రో మార్గాల విస్తరణ, నిర్మాణం కోసం దాదాపు రూ.69 వేల కోట్ల మేర ఖర్చు అవుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. మూడు నాలుగేళ్లలోనే ఈ మెట్రో మార్గాల నిర్మాణం పూర్తవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ మెట్రో మార్గాల నిర్మాణాలపై ప్రతిపాదనలు పూర్తి చేసి.. పూర్తి స్థాయి రిపోర్టును ప్రభుత్వానికి అందించాలని మెట్రో రైల్ అథారిటీ, మున్సిపల్ శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇంకా కొత్త రూట్లు కావాలని భావించినా.. వాటిని కూడా పూర్తి చేస్తామని కేటీఆర్ చెప్పారు. ఇందుకు అవసరమయ్యే నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఒక వేళ సహాయం చేయకపోయినా.. 2024 తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. అందులో బీఆర్ఎస్ తప్పకుండా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి.. రాష్ట్రానికి అవసరమైన నిధులను తెచ్చుకుంటామని కేటీఆర్ చెప్పారు. 


Tags:    
Advertisement

Similar News