బీఆర్ఎస్‌లోకి భారీగా వలసలు.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆందోళన

తొలి లిస్టులో తమ పేర్లు లేకపోవడం, రాబోయే జాబితాల్లో కూడా తమకు టికెట్ వస్తుందనే ఆశ లేకపోవడంతోనే చాలా మంది అధికార పార్టీలోకి క్యూ కడుతున్నారు.

Advertisement
Update:2023-10-19 16:34 IST

బీఆర్ఎస్‌లోకి భారీగా వలసలు.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆందోళన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం మొదటి లిస్టు విడుదల చేసేంత వరకు కాంగ్రెస్‌లో అంతా సక్రమంగానే నడుస్తున్నట్లు అనిపించింది. ఈ సారి తప్పకుండా అధికారంలోకి వస్తామని, నాయకులంతా కలిసికట్టుగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు. అయితే తొలి విడతలో 55 సీట్లు ప్రకటించిన వెంటనే అసలైన కాంగ్రెస్ కనిపించింది. అక్టోబర్ 15 తర్వాత దాదాపు 14 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌లోకి వలస వెళ్లారు. వీరిలో మాజీ పీసీసీ అధ్యక్షుడు కూడా ఉండటం గమనార్హం.

తొలి లిస్టులో తమ పేర్లు లేకపోవడం, రాబోయే జాబితాల్లో కూడా తమకు టికెట్ వస్తుందనే ఆశ లేకపోవడంతోనే చాలా మంది అధికార పార్టీలోకి క్యూ కడుతున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, గద్వాల్ డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి, మెదక్ డీసీసీ అధ్యక్షుడు కాంతారెడ్డి తిరుపతిరెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి డీసీసీ ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్, సీనియర్ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి, గద్వాల్‌కు చెందిన కురువ విజయకుమార్ వంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.

పార్టీ కోసం గత కొన్నేళ్లుగా కష్టపడి పని చేసిన తర్వాత కూడా తమకు టికెట్లు కేటాయించకుండా.. కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు కేటాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పార్టీని వీడిన వారంతా ఆశ్చర్యకరంగా టీపీసీసీ రేవంత్ రెడ్డి టార్గెట్‌గానే విమర్శలు చేయడం గమనార్హం. రేవంత్ రెడ్డి తన స్వలాభం కోసం తమను కాదని ఇతరులకు టికెట్లు కేటాయించారని వారు ఆరోపిస్తున్నారు.

గద్వాల టికెట్‌ను ఒక కాంగ్రెసేతర నాయకుడికి రూ.10 కోట్లు, 5 ఎకరాల భూమి తీసుకొని రేవంత్ కేటాయించారని కురువ విజయ్ కుమార్ బహిరంగంగానే ఆరోపించారు. కాంగ్రెస్ నాయకత్వం టికెట్లను అమ్ముకుంటోందని.. అలాంటప్పుడు పార్టీలో ఎలా కొనసాగగలమని పటేల్ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాకు పార్టీపైన నమ్మకం పోయింది. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్‌లో చేరడానికి నిర్ణయించకున్నానని ప్రభాకర్ రెడ్డి చెప్పారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీలోని బీసీ నాయకులు కూడా అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. టికెట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతోందని, తమను అసలు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. గతంలో బీసీలకు భారీగా టికెట్లు కేటాయిస్తామని అధిష్టానం ప్రకటించింది. కానీ వాస్తవంగా మాత్రం అలాంటి పరిస్థితి లేదని వారు ఆరోపిస్తున్నారు. బీసీలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ 50 మంది నాయకులు ఢిల్లీ వెళ్లారు. కానీ వారిని కలవడానికి కూడా అధిష్టానం ఇష్టపడలేదని ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.

బీసీ నాయకులకు ఢిల్లీ వేదికగా అవమానం జరిగిందని, తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం.. అలాంటిది మమ్మల్ని పదే పదే అవమానిస్తుంటే పార్టీలో మాత్రం ఎలా కొనసాగేదని పొన్నాల వ్యాఖ్యానించారు. అందుకే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. అతి తక్కువ వ్యతిరేకత ఉన్న స్థానాలకే తొలి విడతలో టికెట్లు కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ మొదటి లిస్టు తర్వాతే భారీగా నాయకులు రాజీనామాలు చేశారు. ఇక మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటిస్తే కాంగ్రెస్ నుంచి కీలకమైన నాయకులు బయటకు వెళ్లిపోతారనే ఆందోళన నెలకొన్నది.


Tags:    
Advertisement

Similar News