జనగామలో భారీ అగ్నిప్రమాదం
భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. దాదాపు రూ. 15 కోట్ల మేర ఆస్తి నష్టం
జనగామ జిల్లాలో ఇవాళ భారీ అగ్నిప్రమాదం జరిగింది. సిద్దిపేట రూట్‌లో ఉన్న వస్త్ర దుకాణ సముదాయాల్లో భారీ అగ్ని కిలలు ఎగిసిపడ్డాయి. విజయ, శ్రీలక్ష్మీ షాపింగ్ మాల్స్‌తో పాటు పక్కనే ఉన్న మారు దుకాణాలు దగ్ధమయ్యాయి. ముందుగా విజయ బట్టల షాపులో ప్రారంభమైన మంటలు పక్కనే ఉన్నదుకాణాలకు క్రమంగా విస్తరించాయి. బట్టలు, కంప్యూటర్లు, ఇతర సామాగ్రి కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు 5 గంటల నుంచి శ్రమిస్తున్నా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. జనగామతో పాటు ఆలేరు, భువనగిరి, పాలకుర్తి తదితర ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజిన్లను తెచ్చి మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఉవ్వెత్తున వ్యాపించడంతో పక్కనే ఉన్న దుకాణదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముందుగా షాపుల్లో ఉన్న సామాగ్రిని హుటాహుటిన ఖాళీ చేశారు. ముతూట్ ఫైనాన్స్‌లో బంగారం, నగదు, ఫైల్స్, ఇతర సామాగ్రిని తరలించారు. షాట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని దాదాపు రూ. 15 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని భావిస్తున్నారు. డీసీపీ ఘటనా స్థలికి వచ్చి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.