మణిపూర్ నేరస్థులను ఉరి తీయాలి : బీజేపీ లీడర్ విజయశాంతి

ఇప్పుడు విజయశాంతి చేసిన ట్వీట్‌తో పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరినట్లు అయ్యింది.

Advertisement
Update:2023-07-25 17:48 IST

మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు, అరాచకంపై యావత్ భారత దేశం స్పందిస్తోంది. దాదాపు మూడు నెలలుగా ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో నెలకొన్న హింసాకాండకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం స్పందించడం లేదు. ఇటీవల ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక లైంగిక దాడికి పాల్పడిన తర్వాత.. ప్రధాని నరేంద్ర మోడీ మీడియా ముందకు వచ్చి ఓదార్పు మాటలు మాట్లాడారు. ఆ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంలోని ఏ ఒక్క మంత్రి, బీజేపీ నుంచి ఒక్క లీడర్ కూడా మణిపూర్ అల్లర్లపై పెదవి విప్పలేదు.

ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక అయిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని మణిపూర్‌లో జరుగుతున్న అమానవీయ సంఘటనలపై స్పందించమని కోరగా.. వాటితో నాకు సంబంధం లేదని వ్యాఖ్యానించడం ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. అయితే, తాజగా బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి మణిపూర్ సంఘటనలపై సోషల్ మీడియాలో స్పందించారు.

మణిపూర్‌లో జరుగుతున్న సంఘటనలు యావత్ భారత దేశాన్ని తీవ్ర వేదనకు గురి చేస్తున్నాయి. వాటిని చూసి సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకొని, బాధపడుతున్నదని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి దారుణమైన సంఘటనకు పాల్పడిన నేరస్థులను ఉరి తీసి శిక్షించాలని కోరుకుంటున్నట్లు విజయశాంతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు.

కాగా, ఇటీవల విజయశాంతి బీజేపీ నాయకత్వంపై అలకబూనారు. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన రోజు.. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ హాజరవడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. బీజేపీ నాయకుల ఫోన్లకు అందుబాటులోకి రాకుండా పోయారు. అకస్మాతుగా ఆమె మణిపూర్ విషయంపై సోషల్ మీడియాలో పోస్టు చేయడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

విజయశాంతి.. బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆమె బీజేపీ నాయకులు ఎవరూ మాట్లాడని విషయంపై ట్వీట్ చేయడం ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది. విజయశాంతితో పాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా కాంగ్రెస తీర్థం పుచ్చుకుంటారనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు విజయశాంతి చేసిన ట్వీట్‌తో పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరినట్లు అయ్యింది.


Tags:    
Advertisement

Similar News