తెలంగాణలో లవ్ జీహాద్.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మజ్లిస్ మద్దతుతో ఒక సామాజిక వర్గం హిందూ, క్రిస్టియన్ యువతులను ట్రాప్ చేస్తోందన్నారు. పేద మహిళలను వలలో వేసుకుని మోసం చేస్తున్నారని, పథకం ప్రకారం అమ్మాయిలను ట్రాప్ చేసి హత్యలు చేస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి.
తెలంగాణలో లవ్ జీహాద్ ఘటనలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మజ్లిస్ పార్టీ ప్రోద్బలంతోనే ఈ తరహా ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లిలో ఓ వర్గం యువకుడి దాడిలో గాయపడిన మరో వర్గం యువతి, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా మజ్లిస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లవ్ జీహాద్ తో హిందూ, క్రిస్టియన్ యువతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రేమ పేరుతో వారిని వలలో వేసుకోవడానికి కొన్ని సంస్థలు యువకులకు ఆర్థిక సహాయం చేస్తున్నాయని కూడా ఆరోపించారు.
తెలంగాణలో ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నాయన్నారు కిషన్ రెడ్డి. నేరస్తులకు అధికార పార్టీ అండగా నిలుస్తోందన్నారు. మజ్లిస్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బుజ్జగింపు ధోరణితో ఉండటం వల్లే తెలంగాణలో లవ్ జీహాద్ ఘటనలు పెరుగుతున్నాయన్నారు. మజ్లిస్ మద్దతుతో ఒక సామాజిక వర్గం హిందూ, క్రిస్టియన్ యువతులను ట్రాప్ చేస్తోందన్నారు. పేద మహిళలను వలలో వేసుకుని మోసం చేస్తున్నారని, పథకం ప్రకారం అమ్మాయిలను ట్రాప్ చేసి హత్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లవ్ జీహాద్ లను నిషేధించామన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి కిషన్ రెడ్డి ఇలా ఆరోపణలు చేయడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. లవ్ జీహాద్ జరుగుతోందని తెలిస్తే, కేంద్రంలో అధికారంలో ఉన్న కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని, అధికారంలో ఉన్నవారు, ఆధారాలుంటే నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటున్నారు. మరోవైపు మజ్లిస్ నుంచి ఎవరూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించలేదు. లవ్ జీహాద్ అంటూ నేరుగా పార్టీ పేరుని తప్పుబడుతున్న కిషన్ రెడ్డిపై మజ్లిస్ కాస్త ఘాటుగా స్పందించే అవకాశముంది.
♦