సంపద పెంచుదాం..‌ప్రజలకు పంచుదాం..‌ఇదే తెలంగాణ ప్రగతి నినాదం : సీఎం కేసీఆర్

2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 మాత్రమే ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతితో నేడు మన తలసరి ఆదాయం రూ.3,17,115కి పెరిగిందని కేసీఆర్ చెప్పారు.

Advertisement
Update:2023-06-02 14:40 IST

'సంపద పెంచుదాం.. ప్రజలకు పంచుదాం' అనే నినాదంతో తెలంగాణ ప్రగతి బాటలో దూసుకొని పోతోందని, ఈ నినాదం తెలంగాణలో స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించి.. అభివృద్ధి పథాన నిలిపిందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది దినోత్సవాలను ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా తొమ్మిదేళ్ల రాష్ట్ర ప్రగతి ప్రస్థానంపై సుదీర్ఘంగా ప్రసంగించారు.

2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 మాత్రమే ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతితో నేడు మన తలసరి ఆదాయం రూ.3,17,115కి పెరిగిందని కేసీఆర్ చెప్పారు. పదేళ్ల చిరుప్రాయంలో ఉన్న తెలంగాణ.. దేశంలోని పెద్ద రాష్ట్రాల కంటే మిన్నగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీ విలవ రూ.5,05,849 కోట్ల నుంచి రూ.12,93,469 కోట్లకు పెరిగిందని చెప్పారు. నేడు రాష్ట్రంలోని అన్ని రంగాలు ఆర్థికంగా బలోపేతం కావడంతోనే జీఎస్డీపీ భారీగా పెరిగిందని చెప్పారు. కరోనా, డీమానిటైజేషన్ వంటి సంక్షోభాలు ఏర్పడినా.. వాటన్నిటికీ తట్టుకొని 155 శాతం వృద్ధిని నమోదు చేశామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

అభివృద్ధిని సాధించడమే కాకుండా.. అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో కూడా కొత్త రాష్ట్రం నూతన ఒరవడిని దిద్దిందని అన్నారు. మానవీయ కోణంలో రూపొందించిన పథకాల పట్ల నేడు దేశమంతా ఆదరణ వ్యక్తం అవుతోందని అన్నారు. తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలవడమే కాకుండా.. ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు తమకు కూడా తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు.

ఒకప్పుడు ఎటు చూసినా కరెంటు కోతలే ఉండేవి. కానీ ఇప్పుడు ఎటు చూసినా వరి కోతలే కనిపిస్తున్నాయని అన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని చెప్పారు. కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల పథకంలో నదీజలాలను రాష్ట్రమంతా తరలించి.. బీడు భూములన్నింటినీ సస్యశ్యామలంగా మార్చుకున్నామన్నారు. మిషన్ భగీరథతో తాగునీట కష్టాలకు చరమగీతం పాడామని.. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆచరిస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారు.

దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కుల వృత్తుల కుటుంబాలకు రూ.1లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, మేదరి కుటుంబాలకు ఈ పథకం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. గొల్ల కురుమలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీని చేపట్టామని. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మంది లబ్ధిదారులకు 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేశాము. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీ చేసే కార్యక్రమం దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభమవుతుందని చెప్పారు.

ఆదివాసీల చిరకాల కోరిక అయిన పోడు భూములకు పట్టాలు ఇవ్వడం అనే గొప్ప కార్యక్రమానికి కూడా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీకారం చుట్టుమన్నారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి.. వారికి తెలంగాణ ప్రభుత్వం భూమిపై పూర్తి హక్కులకు కల్పిస్తుందని అన్నారు. జూన్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అటవీ భూములపై ఆధారపడిన 1.50 లక్షల మంది ఆదివాసి, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల భూమిపై యాజమాన్య హక్కును కల్పించనున్నదని చెప్పారు. ఈ భూములకు రైతు బంధు కూడా వర్తిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని పేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాము. ఎంతో వ్యయంతో, వసతులతో కూడిన ఇంటిని ఉచితంగానే అందిస్తున్నామని అన్నారు. ఒక సొంత స్థలం ఉన్న వారి కోసం గృహ లక్ష్మి పథకాన్ని అమలులోకి తెస్తున్నాము. ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలను అందిస్తామని కేసీఆర్ చెప్పారు.

ఐటీ రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం మేటిగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఐటీ వార్షిక ఎగుమతుల విలువ రూ.57,258 కోట్ల నుంచి రూ.1,83,569 కోట్లకు పెరిగిందన్నారు. స్వరాష్ట్రంలో ఐటీ ఎగుమతులు 220 శాతం వృద్ధిరేటు నమోదు చేసిందని సీఎం చెప్పారు. ఐటీ ఉద్యోగాల నియామకాలలో కూడా 156 శాతం వృద్ధి ఉందన్నారు. 2014 నాటికి తెలంగాణలో కేవలం 3,23,396 మంది ఐటీ ఉద్యోగులు ఉంటే.. ఇప్పుడు వారి సంఖ్య 8,27,124కి పెరిగిందన్నారు.

ఐటీ రంగాన్ని హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరింప చేశామని చెప్పారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్ధిపేటలలో కూడా ఐటీ టవర్లను నిర్మించుకున్నాం. ఎస్సీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర అవతరణ అనంతరం రూ.1,400 కోట్ల ప్రోత్సాహకంగా అందించామన్నారు. రాష్ట్రంలో ఖాయిలాపడిన పరిశ్రమలను పునరుద్ధరించడానికి కూడా తగిన ప్రాధాన్యతనిస్తున్నామని.. సిర్పూర్ పేపర్ మిల్స్ వంటి పలు యూనిట్లను పునరుద్దరించామని చెప్పారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ పేరు జాతీయంగా, అంతర్జాతీయంగా మార్మోగిపోతున్నదని అన్నారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఇటీవల యూకే, యూఎస్ఏలోని ప్రముఖ సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతిని గుర్తు చేశారు.

వినూత్న ఆవిష్కరణలతో ముందుకువచ్చే యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్ , రీచ్ సంస్థలు దోహదపడుతున్నాయి. వినూత్న స్టార్టప్ ల ఆవిష్కరణల్ల టీ-హబ్ దేశంలోనే రికార్డు సృష్టించింది. అందుకే టీ-హబ్-2 ను కూడా ప్రారంభించినట్లు చెప్పారు. 2022లో భారత ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ స్టార్టప్ అవార్డులలో మన టీ-హబ్ ఉత్తమ ఇంక్యుబేటర్‌గా నిలిచిందన్నారు.

రాష్ట్రంలో కొత్త రహదారులు కూడా నిర్మించామని అన్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ రోడ్లు గతుకుల మయంగా ఉండేవి. కానీ ఇప్పుడు రోడ్లు అత్యద్భుతంగా అభివృద్ధి చెందాయని చెప్పారు. రాష్ట్రంలోని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి రాజధాని హైదరాబాద్‌కు ఫోర్ లేన్ల రోడ్లు వేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో 1,09,000 కిలోమీటర్ల రోడ్ల నెట్‌వర్క్ ఉందని చెప్పారు.

నాకు ప్రాణ సమానమైన తెలంగాణ రాష్ట్రం చేరాల్సిన గమ్యాలు, అందుకోవాల్సిన అత్యున్నత శిఖరాలు మరెన్నో ఉన్నాయి. మీ అందరి దీవెనలతో నా శరీరంలో సత్తువ ఉన్నంత వరకూ నేను తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం పరిశ్రమిస్తూనే ఉంటానని మాట ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News