విద్యార్థుల కోసం 'లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం'.. తెలంగాణ పాఠశాలల్లో అమలు

ఎల్ఐపీ కోసం జూలై నెలలో టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నది. విద్యార్థుల కనీస సామర్థ్యం పెంచేలా టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.

Advertisement
Update:2023-07-01 10:27 IST

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కనీస సామర్థ్యాలు మెరుగు పరచడానికి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నది. 'లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగాం' (ఎల్ఐపీ) పేరుతో ఆగస్టులో 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. గతేడాది ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తొలి మెట్టు పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అదే విధంగా ఇప్పుడు ఎల్ఐపీని నిర్వహించనున్నారు.

ఎల్ఐపీ కోసం జూలై నెలలో టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నది. విద్యార్థుల కనీస సామర్థ్యం పెంచేలా టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థులు ఆయా భాషల్లో చదవడం, రాయడం వంటి అంశాలపై దృష్టి పెట్టేలా టీచర్లకు తర్ఫీదు ఇస్తారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులు కనీసం ఏం చదువుకున్నారో కూడా వివరించలేక పోతున్నారు. ఇంటికి తిరిగి వెళ్లి పాఠ పుస్తకాలను చదవలేక పోతున్నారు. అలాంటి విద్యార్థుల కోసమే లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం తీసుకొని వస్తున్నారు.

పాఠశాల విద్యా శాఖ, ఆస్కీ, సేవ్ ది చిల్డ్రన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నాయి. ఇందులో భాగంగా ముందుగా బేస్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. దీని ద్వారా ఏయే విద్యార్థి సామర్థ్యం ఎంత ఉందో అంచనా వేస్తారు. ఇక టీచర్లు పాఠాలు ఎలా చెబుతున్నారో పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను నియమిస్తారు. టీచర్లకు నిర్మాణాత్మక సూచనలు, లోపాలు అధిగమించేందుకు కావల్సిన మద్దతును అందిస్తారు.

టీచర్లకు లెసన్స్ ప్లానర్‌ను అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దీని ప్రకారమే విద్యార్థులకు పాఠాలు బోధించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు టీచర్లు స్వయంగా ప్లానర్స్ సిద్ధం చేసుకోవడంతో అవి అంతగా నాణ్యంగా లేవనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అన్ని రకాల ప్రమాణాలను పాటిస్తూ లెసెన్స్ ప్లాన్‌ను రూపొందించింది. 20వేలకు పైగా పాఠ్య ప్రణాళికలను ముద్రించి ఉచితంగా బడులకు అందించనున్నది.

Tags:    
Advertisement

Similar News