కాంగ్రెస్‌ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయి

రాష్ట్రానికి హోం మంత్రి లేడు.. ఇద్దరు డీజీపీలను మార్చారు : ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌

Advertisement
Update:2024-12-30 17:35 IST

కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత శాంతిభద్రతలపై నిన్న డీజీపీ మీడియాతో మాట్లాడారన్నారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక శాంతిభద్రతలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, మొదటి సమావేశంలోనే రూ.700 కోట్ల నిధులిస్తూ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. అందుకే లా అండ్‌ ఆర్డర్‌ లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రానికి హోం మంత్రి లేడని, ఏడాదిలోనే ఇద్దరు డీజీపీలు మారారని తెలిపారు. కేసీఆర్‌ పాలనలో ఎస్సైలు, కానిస్టేబుళ్లు కలిపి 40 వేల ఉద్యోగాల భర్తీ చేశారని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. పోలీసులపై దాడి చేసినా కేసు పెట్టలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. సోషల్‌ మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాక జగిత్యాల ఎస్పీ కేసు పెట్టారని తెలిపారు. 18 ఏళ్లలోపు ఉన్న బాలికలపై అత్యాచారాలు 82 శాతం పెరిగాయని, డబ్బుల కోసం హత్యలు 40 శాతం పెరిగాయన్నారు.

రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్‌ పెరిగిందని, తెలంగాణ పోలీసులు అంటేనే రాజకీయ కక్షలకు మారుపేరుగా మారారని తెలిపారు. టూవీలర్స్‌ దొంగతనాలు పెరిగాయని, సైబర్‌ క్రైమ్‌ 50 శాతం పెరిగిందన్నారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు బీఆర్‌ఎస్‌ నాయకులు, సోషల్‌ మీడియా వారిపై నిఘా పెట్టడం తప్ప ఇతర కార్యకలాపాలను పట్టించుకోవడం లేదన్నారు. గాంధీ భవన్‌ నుంచి ఆదేశాలు వస్తేనే కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. లగచర్లలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో కరెంట్‌ బంద్‌ చేసి మహిళలను వేధించారని గుర్తు చేశారు. ఈరోజు పోలీసు కుటుంబాలే ఆందోళనలు చేస్తున్నాయంటే పరిస్థితులు ఎంతలా దిగజారాయో అర్థం చేసుకోవచ్చన్నారు. పోలీసుల ఆత్మహత్యలు పెరిగాయని, కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్‌ సూసైడ్‌ చేసుకుంటే డీజీపీ నోరు విప్పలేదన్నారు. మహిళా జర్నలిస్టులపై ఆ గ్రామంలో దాడి చేసి, వాళ్లపైనే కేసులు పెట్టారన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బెదిరింపులకు పాల్పడ్డా కేసులు పెట్టని పోలీసులు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ప్రజాసమస్యల కోసం ఆందోళనకు దిగితే కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. సీఎం, సెక్రటేరియట్‌ సెక్యూరిటీ నుంచి స్పెషల్‌ పోలీసులను తీసేసి ఏఆర్‌ పోలీసులను పెట్టుకున్నారని.. అంటే పోలీసులపై నమ్మకం లేదా అని ప్రశ్నించారు. సమావేశంలో నాయకులు కురవ విజయ్ కుమార్, అభిలాష్ రంగినేని, తుంగబాలు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News