సీఎంఆర్ కాలేజీ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్
సీఎంఆర్ కాలేజీలో బాలికల అశ్లీల వీడియోల వివాదంపై తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది.
మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజీలో బాలికల అశ్లీల వీడియోల వివాదంపై తెలంగాణ మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సైబరాబాద్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. అమ్మాయిలు బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు వీడియోలు తీస్తున్నారని విద్యార్ధులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అమ్మాయిల బాత్ రూమ్ లలో కెమెరాలు పెట్టి 300కు పైగా అశ్లీల వీడియోలు తీసినట్లుగా వచ్చిన మీడియా కథనాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థినిలు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు.
కళాశాలల చైర్మన్ గోపాల్ రెడ్డి విద్యార్థి సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. కాగా సీఎంఆర్ కాలేజీ ఘటనపై యాజమాన్యం నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు స్నానం చేస్తున్నప్పుడు బాత్ రూమ్ ల వెనుక భాగంలో వ్యక్తులు తచ్చాడుతున్నట్టు గమనించామని విద్యార్థులు మాకు చెప్పారని, మహిళా పోలీసులతో బాత్ రూమ్ ల వద్ద తనిఖీలు చేయించామని, ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ లభించాయన్నారు.