ఏడాది తర్వాత రేవంత్ కు తప్పు తెలిసొచ్చింది
అందుకే మెట్రో కారిడార్లను పునరుద్దరించారు : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ఏడాది తర్వాత రేవంత్ రెడ్డికి తాను చేసిన తప్పు తెలిసి వచ్చిందని.. అందుకే మెట్రో రైల్ కారిడార్లను పునరుద్దరించారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేసీఆర్ మెట్రో మూడో దశ విస్తరణపై నిర్ణయం తీసుకున్నారని, కన్సల్టెంట్ ను కూడా నియమించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలనే మెట్రో రైల్ విస్తరణ ప్రాజెక్టును చేశారని తెలిపారు. రేవంత్ తన చర్యలతో రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీశారన్నారు. మేడ్చల్, శామీర్‌పేట మెట్రో రైల్ కారిడార్లపై ఏడాది తర్వాత రేవంత్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. హైదరాబాద్ ను వరల్డ్్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు కేటీఆర్ రోడ్ మ్యాప్ తయారు చేశారని అన్నారు. కేసీఆర్ పాలనలో తీసుకున్న నిర్ణయాలను రేవంత్ కొనసాగించి ఉంటే రాష్ట్రం మరింత ముందుకెళ్లేదన్నారు. రేవంత్ రెడ్డి అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని అన్నారు. తాను ఇక మారిన మనిషిని అని నిన్నటి సమావేశంలో కాంగ్రెస్ నేతలతో రేవంత్ అన్నట్టు తెలిసిందని, అంటే ఏడాదిగా తాను చేసిన పనులన్నీ తప్పు అని ఒప్పుకున్నట్టేనని అన్నారు. మేడ్చల్, శామీర్‌పేట మెట్రో కారిడార్ల ప్రకటన బీఆర్ఎస్ విజయమన్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టును చేపట్టాలని డిమాండ్ చేశారు. పది లక్షల మంది ఐటీ ఉద్యోగులు నివసించే ప్రాంతం నుంచి మెట్రో విస్తరణను ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు.
జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ కు రేవంత్ రెడ్డి శంకస్థాపన చేసినా ఇంతవరకు తట్టెడు మట్టి తీయలేదన్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తేనే మెట్రో రైలు పనులు చేస్తామని చెప్పడం సరికాదన్నారు. కేసీఆర్ పాలనలో సొంత నిధులతో మెట్రో రైలు ప్రాజెక్టులు పూర్తి చేశారని తెలిపారు. మెట్రో, ఫార్మాసిటీ, హైడ్రా, హైదరాబాద్ కు తాగునీరు లాంటి అంశాల్లో రేవంత్ తిరోగమన చర్యలు స్పష్టంగా కనిస్తున్నాయన్నారు. వెంటనే మేడ్చల్, శామీర్‌పేట మెట్రో రైలు కారిడార్ పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ఎన్నో తుగ్లక్ నిర్ణయాలు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు వందలాది హామీలిచ్చి.. 400 రోజుల్లోనే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. ఏడాదిలో రూ.1.37 లక్షల కోట్ల అప్పుతెచ్చిన రేవంత్ ఒక్క పెద్ద ప్రాజెక్టు అయినా చేపట్టారో చెప్పాలన్నారు. కొత్తగా ఏదైనా సంక్షేమ పథకాన్ని అమలు చేశారా అని ప్రశ్నించారు. లగచర్లలో లంబాడీలపై, అశోక్ నగర్ లో నిరుద్యోగులపై లాఠీచార్జీ చేయించడం తప్ప రేవంత్ పాలనలో సాధించింది ఏమీ లేదన్నారు. ఏడు తరాలు తిన్నా తరగని ఆస్తి రేవంత్ పోగు చేసుకున్నాడని, ఇకనైనా కక్షపూరిత విధానాలు మానుకోవాలన్నారు. కేసీఆర్ రూ.లక్షల కోట్ల సంపద సృష్టించారని.. ఆయనపై కక్షతో రేవంత్ రెడ్డి వ్యవస్థలను నాశనం చేయొద్దన్నారు. హైడ్రాతో పేదల ఇండ్ల కూల్చివేతలు ఆపాలని, అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.