రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ.. ఎందుకంటే?
2023 డిసెంబర్‌లో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ 47 లక్షల మంది రైతుల రుణమాఫీకి సంబంధించి రూ.49 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పిందన్నారు.
తెలంగాణలో రైతు రుణమాఫీపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామని కాంగ్రెస్ చెప్తుంటే.. నిబంధనల పేరుతో చాలా మంది రైతులను అనర్హులుగా మార్చి కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కేటీఆర్ లేఖలో ఏముందంటే!
2023 డిసెంబర్ 9 నాటికి రూ.2 లక్షల లోపు అన్ని రకాల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, తర్వాత ఎలాంటి కారణం లేకుండానే రుణమాఫీ గడువును 2024 ఆగస్టు 15కు మార్చిందని గుర్తుచేశారు కేటీఆర్. 2023 డిసెంబర్‌లో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ 47 లక్షల మంది రైతుల రుణమాఫీకి సంబంధించి రూ.49 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం జనవరిలో రూ.40 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారని గుర్తు చేశారు కేటీఆర్.
తర్వాత ఒకేసారి రుణమాఫీ మొత్తంలో ప్రభుత్వం రూ. 9 వేల కోట్లు కోత విధించిందన్నారు కేటీఆర్. జూన్‌లో భేటీ అయిన తెలంగాణ కేబినెట్ రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. అంటే ఇక్కడ మరో రూ.9 వేల కోట్లకు కోతపెట్టిందన్నారు కేటీఆర్. ఇక 2024 జూలైలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో రుణమాఫీ కోసం కేవలం రూ.26 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, ఇక్కడ మరో 5 వేల కోట్లు కత్తిరించారని లేఖలో పేర్కొన్నారు. కానీ ఆగస్టు 15 నాడు రూ.17 వేల 934 కోట్లతో రుణమాఫీ పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి మోసపూరిత ప్రకటన చేశారన్నారు కేటీఆర్. ఇక్కడ మరో రూ.8 వేల కోట్లను మాయం చేశారన్నారు. ఇది మోసమో, కాదో వివరణ ఇవ్వాలంటూ లేఖలో కోరారు కేటీఆర్.