ఆ ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు..

యువత పుణ్యాన వారిద్దరికీ మంచి ఉద్యోగాలు దొరికాయని, యువత మాత్రం వారి మాట విని మోసపోయిందని అన్నారు కేటీఆర్.

Advertisement
Update:2024-07-14 12:06 IST

తెలంగాణలో నిరుద్యోగుల పోరాటానికి ఫలితం కనిపించట్లేదు. పోస్ట్ లు పెంచాలని, పోస్ట్ పోన్ చేయాలంటూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలకు ప్రభుత్వం కరగలేదు. దీంతో నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టిన వారు ఇప్పుడెక్కడున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఆందోళనలపై ట్వీట్ వేశారు. ఎన్నికలకు ముందు యువతను రెచ్చగొట్టిన కాంగ్రెస్ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికాయని, కానీ వారి మోసపు హామీలతో యువత రోడ్డునపడిందని విమర్శించారు.


ఆ ఇద్దరు ఎవరు..?

కాంగ్రెస్ కి చెందిన ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు చందమామను చేతిలో పెడతామంటూ తెలంగాణ యువతను రెచ్చగొట్టారని, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టారని అన్నారు కేటీఆర్. యువత పుణ్యాన వారిద్దరికీ మంచి ఉద్యోగాలు దొరికాయని, యువత మాత్రం వారి మాట విని మోసపోయిందని అన్నారు.

ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానం చేసిందని, ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలవుతున్నా.. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు కేటీఆర్. దీంతో తెలంగాణ యువత హైదరాబాద్ వీధుల్లో ఆందోళనకు దిగిందని, వారిని రెచ్చగొట్టిన నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు.

యువత ఆందోళనలు కొనసాగుతున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం కనికరించేలా లేదు. పోటీ పరీక్షలు పోస్ట్ పోన్ చేసేది లేదంటూ ఇప్పటికే పలుమార్లు నేతలు క్లారిటీ ఇచ్చారు. అటు అభ్యర్థులు మాత్రం తగ్గేది లేదంటున్నారు. దీంతో పోటీ పరీక్షల విషయంలో కన్ఫ్యూజన్ ఇంకా కొనసాగుతోంది. 

Tags:    
Advertisement

Similar News