అది డేర్ డెవిల్ వర్క్.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

ఆ యువకులు చేసిన పనిని మెచ్చుకుంటూనే, అదే సమయంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యాన్ని కూడా ప్రస్తావించారు కేటీఆర్.

Advertisement
Update:2024-08-21 11:22 IST

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వినిపిస్తున్న ప్రధాన కంప్లయింట్ కరెంటు కోతలు. అటు రైతులు కరెంటు లేక అవస్థలు పడుతున్నారు, ఇటు ఇళ్లకు సరఫరా అయ్యే కరెంటు విషయంలో అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తప్పు ఒప్పుకోలేదు సరికదా, అవి రాజకీయ విమర్శలంటూ సరిపెట్టింది. తాజాగా ఓ సంఘటనను ఉదాహరణగా చూపెడుతూ కరెంట్ డిపార్ట్ మెంట్ అలసత్వాన్ని గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.


మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చర్లపల్లి తండాలో షార్ట్ సర్క్యూట్ తో ఓ విద్యుత్ వైర్ తెగిపోయింది. దీంతో రామచంద్రాపురం పంచాయతీలోని రెండు గ్రామాలకు కరెంటు సరఫరా ఆగిపోయింది. మధ్యాహ్నం 2 గంటలకు కరెంటు పోగా, అధికారులకు స్థానికులు సమాచారమిచ్చారు. రాత్రి అయినా వారు రాలేదు. కరెంటు లేకపోతే రాత్రివేళ అవస్థలు పడాలనుకున్న గ్రామస్తులు ధైర్యం చేసి సమస్యను వారే పరిష్కరించుకున్నారు. స్థానిక యువకులే జంపర్ వేసి కరెంటు సరఫరా పునరుద్ధరించుకున్నారు. ఈ వార్త వైరల్ గా మారింది. కేటీఆర్ కూడా ఈ వార్తని తన ట్వీట్ కి జత చేస్తూ కామెంట్ పెట్టారు.

విద్యుత్ శాఖ తీరుతో విసిగిపోయిన గ్రామస్తులు కరెంటు స్తంభం ఎక్కి సమస్య పరిష్కరించుకున్నారని చెప్పారు కేటీఆర్. ఇలా చేయడం ప్రమాదకరం అని తెలిసినా, వారికి ప్రత్యామ్నాయం లేదని అన్నారు. ఆ యువకులు డేర్ డెవిల్ వర్క్ చేశారన్నారు. ఆ యువకులు చేసిన పనిని మెచ్చుకుంటూనే, అదే సమయంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యాన్ని కూడా ప్రస్తావించారు కేటీఆర్. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ప్రాణాపాయం జరిగే అవకాశముందని, గ్రామస్తులు పూనుకోక ముందే విద్యుత్ శాఖ సిబ్బంది అక్కడ కరెంట్ పునరుద్ధరిస్తే బాగుండేదని అన్నారు కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News