ఆ ఘనత మాదే.. కాంగ్రెస్ దాన్ని కొనసాగించాలి
తమ హయాంలో మొదలు పెట్టిన ఈ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్లాలని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.;
నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ (MLCP) పనులు పూర్తి కావడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ MLCP పనుల్ని గతంలో తామే ప్రారంభించామని, కొన్ని కారణాల వల్ల అది ఆలస్యమైనా, ఇప్పటికి పూర్తయినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. పీపీపీ విధానంలో ఈ పనుల్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణం పూర్తయింది. త్వరలో దీన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి.
MLCP ప్రత్యేకతలేంటి..?
నాంపల్లి మెట్రో స్టేషన్‌కు సమీపంలో HMRLకు చెందిన అర ఎకరం స్థలంలో ఈ MLCP నిర్మించారు. మొత్తం 15 అంతస్తుల్లో ఈ కాంప్లెక్సు నిర్మాణం జరిగింది. 10 అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం, ఐదు అంతస్తుల్లో కమర్షియల్ షాపులు, రెండు స్క్రీన్‌లతో కూడిన సినిమా థియేటర్ ఈ కాంప్లెక్స్ లో ఉంటాయి. మొత్తం 1,44,440 చదరపు అడుగుల విస్తీర్ణంలో 68శాతం పార్కింగ్ కి కేటాయించారు. 32 శాతం వాణిజ్య సముదాయాలకు కేటాయిస్తున్నారు. పార్కింగ్ స్థలంలో 250 కార్లు, 200 బైక్ లు నిలిపే అవకాశముంది.
ఈ MLCP లోపలకు వెళ్లేందుకు 2, బయటకు వెళ్లేందుకు మరో 2 టెర్మినల్స్ ఉన్నాయి. వాహనాల పార్కింగ్ కోసం టర్న్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఈ టేబుల్‌పై వాహనదారుడు తమ వాహనాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్లిపోవచ్చు. ఆ తర్వాత వాహనదారుడికి స్మార్ట్ కార్డు జారీ అవుతుంది. వాహనం యొక్క కొలతల ఆధారంగా కంప్యూటరైజ్డ్ పార్కింగ్ సిస్టమ్ ద్వారా వాహనాల వర్గీకరణ జరుగుతుంది. ఆ తర్వాత వాటిని ఆయా అంతస్తుల్లోకి షిఫ్ట్ చేస్తారు. వినియోగదారుడు వచ్చిన తర్వాత స్మార్ట్ కార్డ్ చూపించగానే వారి వాహనాన్ని తిరిగి టర్న్ టేబుల్ పైకి చేరుస్తారు. తగిన రుసుము చెల్లించి దాన్ని తిరిగి తీసుకెళ్లొచ్చు.
పార్కింగ్ కోసం కేవలం ఒక నిమిషం కంటే తక్కువ సమయం పడుతుంది. మన పని పూర్తయ్యాక పార్కింగ్ చేసిన వాహనాన్ని 2 నిమిషాల్లోపే తిరిగి తీసుకోవచ్చు. తమ హయాంలో మొదలు పెట్టిన ఈ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్లాలని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని మరిన్ని ప్రాంతాల్లో ఈ పార్కింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలన్నారు.