తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇరు రాష్ట్రాల్లో 3 చొప్పున స్థానాలకు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు సాగింది. 4 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్- మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 40.61 శాతం, ఇవే జిల్లాల్లో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 63.49 శాతం, వరంగల్- నల్లగొండ- ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 76.35 శాతం పోలింగ్ నమోదు అయింది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ సమయం ముగిసే నాటికి పశ్చిమ గోదావరి జిల్లాలో 65.43 శాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో 87.30 శాతం పోలింగ్ నమోదు అయింది. ఎన్‌టీఆర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసే సమయానికి 61.99 శాతం నమోదు అయింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడం ఇందులో ఇటు పట్టభద్రుల, అటు టీచర్ల పల్స్ ఎలా ఉండబోతుందనేది ఈ ఎన్నికలతో తేలనుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఎలాగైనా గెలిచేందుకు అధికార కాగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా కృషి చేశాయి. మార్చి 3వ తేదీన తుది ఫలితాలను ఎన్నికల కమిషన్ వెల్లడించనుంది.