సహాయక చర్యల్లో ప్రభుత్వం ఫెయిల్

మేం సంయమనం పాటిస్తే సీఎం, మంత్రులు మాపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌ ఫైర్‌

Advertisement
Update:2025-02-27 10:40 IST

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. టన్నెల్‌లో ఇప్పటికీ సహాయక చర్యలు ప్రారంభం కాలేదని మండిపడ్డారు. ఎస్‌ఎల్‌బీసీ వద్ద సహాయ చర్యలు పరిశీలించడానికి హైదరాబాద్‌ నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లా నేతలతో కలిసి హరీశ్‌రావు బయలుదేరి వెళ్లారు.సహాయక చర్యలు వేగవంతం చేయడంపై మా అనుభవంతో కొన్ని సూచనలు చేస్తామని హరీశ్‌ రావు తెలిపారు. ఎస్ఎల్ బీసీ వద్దకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగి నేటికి ఐదు రోజులు అయ్యింది. టన్నెలో చిక్కుకున్న 8 మంది ప్రాణాలు కాపాడటానికి ప్రతి నిమిషం చాలా విలువైంది. మీరు త్వరగా సహాయక చర్యలు ప్రారంభించి వారి ప్రాణాలను కాపాడాలని సూచించారు. లోపల వారికి ఆహారం లేదు, నీళ్లు లేవు. వాళ్లు ఎలా బతకాలి? దీనిపై ప్రభుత్వ శ్రద్ధ కరువైంది అనిపిస్తున్నది. ఇప్పటివరకు సహాయక చర్యలే ప్రారంభం కాలేదు. బురదను తొలిగించాలి. టన్నెల్‌ను తొలిగించాలా? సహాయక చర్యలకు అడ్డుగా ఉన్న భాగాలను తొలిగించాలా? లోపల కూలిన మట్టిని బైటికి తీస్తే పైన కూలుతుందా? ఇలాంటి ప్రశ్నలపై ఒక అంచనాకు రాలేకపోతున్నారు. అవగాహనకు రాలేకపోతున్నారు. ప్రమాదం జరగడం దురదృష్టకరం. అది ఎలా జరిగింది? ప్రభుత్వ వైఫల్యం ఉన్నదా? తొందరపాటు వల్ల జరిగిందా? జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చిందా? అనుమతిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ విషయాలన్నీ బైటికి రావాలన్నారు.ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధాకరంగా ఉన్నది. సీఎం హెలికాప్టర్‌ వేసుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా? ఎన్నికల ప్రచారం ముఖ్యమా? అని ప్రశ్నించారు. సీఎం అక్కడికి వెళ్లి ఆ సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో గాని, డైరెక్షన్‌ ఇవ్వడంలోనూ సీఎం, నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌ ఫెయిల్‌ అయ్యారని ధ్వజమెత్తారు. 

బీఆర్‌ఎస్‌ తరఫున ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించవద్దు. సహాయక చర్యలకు ఆటంకం కలుగవద్దని సంయమనం పాటించాం. కానీ బాధకలిగే అంశంమేమంటే నాలుగురోజులు గడిచినా ఇప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. పది ఏజెన్సీలు ఉన్నాయి. ఒక్కొక్కరు వెళ్తున్నారు. సహాయ చర్యలపై ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. అందరి చెప్పే వాటి అంశాల ఆధారంగా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి ఒక డైరెక్షన్‌ ఇచ్చి వాళ్లను బైటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలి. అందులో పూర్తిగా ప్రభుత్వం ఫెయిల్‌ అయిపోయింది. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీలో కూర్చుని సీఎం రేవంత్‌ రెడ్డి, టన్నెల్‌ వద్ద మంత్రి ఉత్తమ్‌ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. బీఆర్‌ఎస్‌పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మంత్రి వెంకట్‌రెడ్డి నీళ్లు, వాటర్‌ అంటూ ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. ఆయన గురించి మాట్లాడటం దండుగ అని ఎద్దేవా చేశారు. ఇలా గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది. 

Tags:    
Advertisement

Similar News