40లక్షలమంది రుణం తీసుకుంటే 11లక్షలమందికే మాఫీయా..?

రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోనుంచి రూ.7000 కోట్లు దారి మళ్లించి వాటితో రుణమాఫీ అమలు చేయాలని చూడటం దారుణం అని అన్నారు కేటీఆర్.

Advertisement
Update:2024-07-18 11:18 IST

తెలంగాణలో రైతు రుణమాఫీ అంశం విమర్శలకు దారితీస్తోంది. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా బేషరతుగా రైతుల రుణాలు మాఫీ చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. తెలంగాణలో 40లక్షలమంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షలమందికే మాఫీ ప్రయోజనాలు వర్తించేలా ప్రభుత్వం నిబంధనలు పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు.


మాఫీకోసం రైతుబంధు నిధులు..

రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోనుంచి రూ.7000 కోట్లు దారి మళ్లించి వాటితో రుణమాఫీ అమలు చేయాలని చూడటం దారుణం అని అన్నారు కేటీఆర్. రైతులకు హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుండి కొంతమొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు ఫోజులు కొడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 2014, 2018లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులే ఇప్పుడు అర్హులుగా మారారని, మిగతా వారికి కాంగ్రెస్ మొండిచేయి చూపించిందని గుర్తు చేశారు కేటీఆర్.

గతంలో ఇలా..

2014 లో కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ. 16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల మంది రైతులకు లబ్ది చేకూర్చిందని చెప్పారు కేటీఆర్. 2018లో రుణమాఫీకి రూ. 19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్దిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు అని అన్నారు. కానీ కాంగ్రెస్ హయాంలో అర్హుల సంఖ్య కేవలం 11 లక్షలే అంటున్నారని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. మేనిఫెస్టో హామీ ప్రకారం రూ.2 లక్షల వరకు ఉన్న పంటరుణాలను వెంటనే మాఫీ చేయాలని, అర్హులందరికీ రుణమాఫీ ప్రయోజనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో రైతుబంధు నిధులు కూడా వెంటనే జమ చేయాలని కోరారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News