నీట్ గందరగోళం.. మోదీ సర్కారుపై కేటీఆర్ ఆగ్రహం
తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్ష వ్యవహారం నీళ్లు చల్లిందని విమర్శించారు కేటీఆర్.
పరీక్షాపే చర్చ అంటూ విద్యార్థులను కూడా ప్రచారానికి వాడుకున్న మోదీ, ఇప్పుడు నీట్ విద్యార్థుల కష్టాలు తీర్చే విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా కేంద్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఓవైపు గ్రేస్ మార్కుల గందరగోళం ఉండగానే, మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతోందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని, వెంటనే బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలన్నారు. ఈమేరకు ఎన్డీఏ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్ష వ్యవహారం నీళ్లు చల్లిందని విమర్శించారు కేటీఆర్. బీహార్‌లో రూ.30 లక్షల చొప్పున నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని, ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పందించడంలేదన్నారు. మొదటి నుంచీ నీట్ ఎంట్రన్స్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందన్నారు కేటీఆర్.
గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్‌లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం ఎన్నోరకాల అనుమానాలకు తావిస్తోందన్నారు కేటీఆర్. అలా ఫస్ట్ ర్యాంక్ సాధించిన వారంతా ఒకే సెంటర్ లో ఉండటం, ఒకే చోట పరీక్ష రాసిన 8 మందికి 720 మార్కులు రావడం చూస్తే.. పేపర్ లీకేజీ జరిగిందనే విషయం స్పష్టమవుతోందన్నారు. నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు, తలరాతలు మారిపోతాయని, ఎంతోమంది అవకాశాలు కోల్పోతారని గుర్తుచేశారు కేటీఆర్. నీట్ పరీక్ష ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించడం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు. విచారణకు ఆదేశించకపోగా, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్.. అంతా సవ్యంగానే జరిగిందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు కేటీఆర్. గ్రేస్ మార్కుల వ్యవహారంపై కూడా కేంద్రానికి సూటిగా ప్రశ్నలు సంధించారు కేటీఆర్. గతంలో గ్రేస్ మార్కుల ఆనవాయితీ లేదని, ఇప్పుడు కొత్తగా గ్రేస్ మార్కులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కోర్టు జోక్యంతో గ్రేస్ మార్కులపై కేంద్రం వెనక్కి తగ్గిందని, పూటకోమాట మాట్లాడుతున్న నేతలు విద్యార్థుల భవిష్యత్ ని ప్రశ్నార్థకంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.