ప్రతీ విషయంలో కేటీఆర్ టార్గెట్.. ప్రతిపక్షాలు ఎందుకు ఇలా చేస్తున్నాయి?

ఇన్నాళ్లూ తనను ఎవరైనా టార్గెట్ చేసినా వారికి కాస్త కఠినంగానో, సాఫ్ట్‌గానో సమాధానం చెప్పారు. తనపై ఏ ఆరోపణలు వచ్చినా సాక్ష్యాలు చూపించి వాటిని కేటీఆర్ ఎన్నో సార్లు ఖండించారు.

Advertisement
Update:2023-03-30 07:53 IST

తెలంగాణ ప్రభుత్వ విషయంలో ఏవైనా ఆరోపణలు వచ్చినా, శాఖా పరంగా తప్పులు జరిగినా ప్రతిపక్షాలు ముందుగా మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ కంటే ఎక్కువగా కేటీఆర్ ప్రతిపక్షాలకు లక్ష్యంగా మారారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ టార్గెట్‌గా ఆరోపణలు చేశారు. గతంలో చాలా సార్లు ఇలా కేటీఆర్‌ను పలు వివాదాల్లో ఇరికించడానికి ప్రయత్నించారు. అప్పట్లో వారి మాటలను లైట్ తీసుకున్న మంత్రి కేటీఆర్.. ఈ సారి మాత్రం చాలా సీరియస్‌గా వ్యవహరించారు. తనపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపారు.

ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే మంత్రి కేటీఆర్ టార్గెట్ అవుతారు. ప్రైవేటు ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య చేసుకుంటే మంత్రి కేటీఆర్ బాధ్యత అంటారు. డ్రగ్స్ కేసులో ఎవరో పట్టుబడితే కేటీఆర్ ఈ కేసు వెనుక ఉన్నారని అంటారు. చివరకు ధరణిలో లోపాలు బయట పడితే కేటీఆర్ కారణమని అభాండాలు వేస్తున్నారు. తన శాఖ కాకపోయినా.. తెలంగాణలో ఏం జరిగినా చివరకు కేటీఆర్‌ను బండి సంజయ్, రేవంత్ రెడ్డి కావాలనే టార్గెట్ చేస్తున్నాననే విషయం అర్థం అవుతోంది.

ఇన్నాళ్లూ తనను ఎవరైనా టార్గెట్ చేసినా వారికి కాస్త కఠినంగానో, సాఫ్ట్‌గానో సమాధానం చెప్పారు. తనపై ఏ ఆరోపణలు వచ్చినా సాక్ష్యాలు చూపించి వాటిని కేటీఆర్ ఎన్నో సార్లు ఖండించారు. కానీ టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో మాత్రం కేటీఆర్ తనను టార్గెట్ చేస్తున్న వారిని ఈ సారి వదిలిపెట్టే ఆలోచన చేయడం లేదు. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు.

కేటీఆర్‌ను ప్రతిపక్షాలు టార్గెట్ చేయడం వెనుక చాలా పెద్ద కారణం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు. ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటి ఢిల్లీ లెవెల్‌లో రాజకీయాలు చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారు. అదే జరిగితే తెలంగాణకు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కేటీఆర్‌కు ఉంటాయి. ఇప్పటికే ఆయన కాబోయే సీఎం అని పార్టీ వర్గాలు, అభిమానులు చెప్పుకుంటారు. అందుకే కేటీఆర్‌ను నైతికంగా, మానసికంగా దెబ్బతీయడానికే ప్రతిపక్షాలు ఇలా ప్రతీ దానికి ఆయనను లాగుతున్నాయి. అంతే కాకుండా కేటీఆర్‌ను ఇరికించి పార్టీ ప్రతిష్టను కూడా దెబ్బ తీయాలని భావిస్తున్నాయి.

ఒకవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేసింది. ఇక తెలంగాణలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఒక రకంగా సీఎం కేసీఆర్‌ను ఏమీ చేయలేక ఇలా కుటుంబ సభ్యలపై అభాండాలు వేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ కుటుంబాన్ని మానసికంగా బలహీనం చేయాలనే ఇలా ప్రతీ దానికి లింక్ పెడుతున్నాయనే చర్చ జరుగుతోంది. అయితే, ఇలాంటి అభాండాలు వేసినంత మాత్రాన కేసీఆర్, కేటీఆర్ బలహీనం కాబోరని పార్టీ అభిమానులు అంటున్నారు.తెలంగాణ ఉద్యమంలోనే ఎన్నో ఢక్కామొక్కీలు తిని రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్, ఆయన కుటుంబం.. ఇలాంటి తప్పుడు ఆరోపణలకు భయపడదు అని చెబుతున్నారు. ఏదేమైనా ప్రతీ సారి కేటీఆర్ టార్గెట్ చేయడం అంతా ఒక వ్యూహంలో భాగమేనని అంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News