పేద ఏడుపులేడ్చిన అన్న- కోటీశ్వరులమని చెప్పిన తమ్ముడు...ఎవరు నిజం?
కోమటి రెడ్డి బ్రదర్స్ మాట్లాడిన విరుద్ద మాటల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాము అత్యంత పేదవాళ్ళమని అన్న వెంకట రెడ్డి, తాము గొప్ప కోటీశ్వరులమని తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలపై ట్విట్టర్ లో నెటిజనులు దుమ్మెత్తి పోస్తున్నారు.
మునుగోడు ఎన్నికల వేడి రాజుకుంటున్న కొద్దీ కోమటి రెడ్డి బ్రదర్స్ వ్యవహారం రసవత్తరంగా నడుస్తోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ఆయనకు జార్ఖండ్ లో ఓ బొగ్గుగని లీజుకిచ్చారన్న విషయం కొద్ది రోజుల క్రితం బైటపడింది. ఆ తర్వాత తనకు కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిందని రాజ్ గోపాల్ రెడ్డి స్వయంగా ఓ టీవీ ఛానల్ లో చెప్పాడు. దీనిపై ఇప్పుడు అన్ని పార్టీలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. 'పేటీఎం' లాగా 'పే కాంట్రాక్టర్ ' అంటూ ఆయన మీద మునుగోడు నియోజక వర్గంలో పోస్టర్లు వెలిశాయి. సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డి మీద నెటిజనుల దాడి కూడా తీవ్రంగా ఉంది. ఆయనను సమర్దించడానికి బీజేపీ నాయకులు ఎన్ని అవస్థలు పడ్డా ఉపయోగం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ట్విట్టర్ లో ఓ వీడియో వైరల్ అవుతోంది. తమ ఆర్థిక పరిస్థితి గురించి కొద్ది రోజుల క్రితం కోమటి రెడ్డి వెంకట రెడ్డి, రాజ గోపాల్ రెడ్డిలు వేరు వేరుగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో జనాలను విపరీతంగా ఆకర్శిస్తోంది. అందులో తాము చాలా పేదవాళ్ళమని అన్న వెంకట రెడ్డి చెప్పగా. తాము గొప్ప కోటీశ్వరులమని తమ్ముడు రాజగోపాల్ రెడ్డి చెప్పారు....
ఆ వీడియోలో ఏముందంటే....
''30 ఏళ్ళ నుంచి నల్గొండలో కిరాయి ఇంట్లో ఉంటున్నాను. ఊర్లో మా ఇల్లు చూడండి రెండు రూములుంటది. అది కూడా రేకుల రూములు. రెండు రూములు నిన్న మొన్న కొత్తగేసుకున్నం'' - కోమటి రెడ్డి వెంకటరెడ్డి
''నేను రాజకీయాలకు రాకముందే సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కు మేనేజింగ్ డైరెక్టర్ ను. ఇది మా సోదరుడు స్థాపించిన కంపెనీ . మాకున్న బ్యాగ్రౌండ్, మా సోదరులు, నా కొడుకు చేసేదాన్ని చూడండి. 7 కోట్లు ఏంటి 70 కోట్లు పెట్టి హెలీకాప్టర్ కొనడం పెద్ద గొప్ప విషయం కాదు'' -కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఇవి ఆ సోదరులు మాట్లాడిన మాటలు. వీళ్ళిద్దరూ వ్యాపారపరంగా విడిపోలేదు. ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా ఇద్దరూ కలిసే చేస్తారు. ఇప్పుడు మునుగోడు ఎన్నికల్లో కూడా తమ్ముడి గెలుపుకోసం తన స్వంత పార్టీని వెంకట రెడ్డి మోసం చేస్తున్నాడని కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసిందే వెంకట రెడ్డి అని స్వయంగా రాజగోపాల్ రెడ్డే చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము అత్యంత పేదవాళ్ళమని చెప్పిన అన్న మాటలు నిజమా లేక తాము గొప్ప కోటీశ్వరులని చెప్పిన తమ్ముడి మాటలు నిజమా అని ట్విట్టర్ లో నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.