శాంతిభద్రతల సమస్యపై ఉన్నతాధికారులతో కేసీఆర్ అత్యవసర సమీక్షా సమావేశం
బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర డీజీపీతో సహా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
కొద్ది రోజులుగా బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, చేతల వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా తయారయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసనప్రదర్శనలు జరుగుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో యువత ఆగ్రహంగా ఉన్నారు. నిన్న, మొన్నపగలే కాదు, రాత్రుళ్ళు కూడా ప్రదర్శనలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని పలుపట్టణాల్లో కూడా ప్రదర్శనలు జరుగుతున్నాయి. రాజాసింగ్ కు బెయిల్ రావడంతో పాత బస్తీలో యువత మరింత రెచ్చిపోయే అవకాశం ఉన్నదని పోలీసులు భావిస్తున్నారు.
మరో వైపు బండి సంజయ్ పాద యాత్ర కూడా శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఉన్నదనే ఆరోపణలున్నాయి. సంజయ్ రెచ్చ గొట్టే ఉపన్యాసాలతో హింస చెలరేగే అవకాశం ఉన్నదనే రిపోర్టులతో ప్రభుత్వం ఆందోళనగా ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి తో సహా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషన్ర్లు, ఇతర నగరాల కమిషనర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, మరి కొందరు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంకా సమావేశం కొనసాగుతోంది.